మేఘాంబర మేలి వస్త్రం ధరించి
స్మర్యంత్ర సింధూరం నుదుటిన దిద్ది
హరిమోహన హారాలతో అలంకరించుకుని
కన్దర్పకుహలీ వనాన కోకిల గానం చేస్తుండగా
వెన్నెల వీధిలో వెండంచు మబ్బులు విహరిస్తుండగా
సంపెంగ సువాసనల సమీరాలు వీస్తుండగా
రాగిణీ పుష్పాల మాల కడుతూ
రాధారాణి నీ రాకకై ఎదురుచూస్తుంది...
మదనమోహన మురళీగానం మదిని తాకిన
మైమరచి ఆడే మయూరాలు నీ రాకని తేలపకనే తెలుపుతున్నాయి
హంసగంజన సవ్వడులు కలఝంకారాలతో కలసి
నీ అల్లన మెల్లని అడుగుల సడిని వినిపిస్తున్నాయి
నీవు రాగానే నీ హృదయమోదన స్థానంలో తలవాల్చి
కనులుమూసి కలవరించి
తనువు మరిచి పులకరించి
తనలోని ప్రేమనంతా నీకు అర్పించాలని
గోవింద ప్రణయధార హృదయం ఎగసి పడుతున్నది...