ఎగిరి పోవే మనసా...




నేల పైనే నింగి సాక్షాత్కరిస్తుంది
నింగి అంచులలో నడచినట్టు తోస్తుంది
నవ్వు కూడా నదివెల్లువైపోతుంది
ఊహలన్నీ పాలపిట్టలై పరుగులు తీస్తాయి
పలుకులన్ని పారిజాతాలల్లె పరిమళిస్తాయి
రంగులు రంగులు
ఎటు చూసినా రంగులు
కనులకంతా విందులు
ఉదయపు తొలికిరణం మొదలు
రేయి మలిఘడియ వరకూ అంతా ఆనందం
ఏదో తెలీయని తారంగం
వేసవిలోనైనా చలిమంట వేసే వెర్రి వయసుతో కూడి
మతిలేని మనసు చేసే వీరంగం
అంతా కోలాహలం
అర్ధంకాని గందరగోళం
అందమైన రెండక్షరాల పదం ఆడే ప్రణ(ళ)య తాండవం
ఆ ప్రళయ కాల అలలు చుట్టుముట్టి
ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరిని లాగి మింగేసినప్పుడు
నాడులన్ని స్థంబించి
బీటలువారిన గాజు హృదయం ముక్కలుగా పగిలినప్పుడు
ఆ ముక్కలనే రెక్కలుగా చేసి పైకెగరగలిగితే
ఆత్మవిశ్వాసమే ఆయువై
ఆత్మాభిమానమే ధైర్యమై
సాగే ఆ పయనానికి ఆకాశమే హద్దు . . !


తీయటి కన్నీరు ...




గుప్పిట తెరవగానే మిణుగురులు 
మిలమిలలాడుతూ బిలబిల ఎగురుతూ నా భుజంపై వాలాయి 
ఆ మినుగురుల మిసిమి వెలుగులో పసితనపు స్మ్రుతులెన్నో కదలాడుతున్నాయి 
నింగి దిగివచ్చిన తారకల్లా నా చుట్టూ నాట్యమాడి 
నన్ను తమ రెక్కలపై ఎక్కించుకుని గతకాలపు లోకాలలోకి పరుగుతీశాయి 
అడుగడుగునా కనిపిస్తున్నఆత్మీయ నేస్తాలు...  
ప్రతి మలుపులో పలకరించు ప్రాణ స్నేహాలు... 
మరలిరాని ఆ మధుర క్షణాలని పూవులుగా అందించి నాకు స్వాగతం పలుకగా 
అనుభూతో, ఆనందమో తెలియని ఒక భావావేశం పెల్లుబికి
తీయటి కన్నీరై  చెక్కిలిని మృదువుగా నిమురుతూ జారుతుంది...! 

స్త్రీ





తానొక ఆద్యంతాలు లేని పదం
కళ్ళు తెరవక మునుపే కన్నుమూస్తుంది 








తానొక విష వలయంలో కమలం 
రేకువిప్పకుండగనే వాడిపోతుంది







తానొక అందమైన హరివిల్లు 
విషమొకటి వొలికి వివర్ణమవుతుంది






తానొక అరవిరిసిన పుష్పం 
నెత్తుటిలో తడిసి ముద్దవుతుంది






తానొక స్వచ్చమైన శ్వేత ముత్యం
ముక్తాగార కారాగారంలో బంధీయైపోతుంది








తానొక చీకటి గుహలో దీపం
ఆ దావానలంలో దహించుకుపోతుంది 







తానొక పరిమళం తగ్గిన మరువం
వెలివడి వీధిన పడుతుంది

 స్త్రీ...
తానొక ఒంటరి అక్షరం..!! 
సృష్టి మొదలు, నేటి వరకూ 
తన ఉనికి కోసం తాను వెతుకుతూనే ఉంది !
గెలుపెరుగని ఒంటరి పోరాటం సాగిస్తూనే ఉంది !!

Popular Posts

.