ఒక చిన్ని కోరిక.....




తెలతెలవారుఝామున
తెలతెల్లని తెలిమంచు తుంపరలు
తడితడిగా తడుముతుండగా...
సాగర తీరంలో, నీ సాంగత్యంలో...
తరుణాదిత్యుని అరుణిమను ఆస్వాదిస్తూ,
పతగపతులను పలకరిస్తూ,
తథాగతుని తిలకిస్తూ,
తన్మయమై, తమకానందమై....
ప్రభాత ప్రత్యూషమును వీక్షించాలని ఉంది ప్రియా...!
నా ఈ చిన్ని కోరికని మన్నిస్తావా....?
ఒక అద్భుతమైన అనూషమును నాకు అందిస్తావా.....?





యా అల్లా....!!





అక్కడ పరదాల మాటున ఫత్వాలు ఎరుగని నీడలు కదలాడుతూ ఉంటాయి...!
హిజాబుల ముసుగులో హిసాబ్ తేలని ప్రశ్నలు వేళ్ళాడుతూ కనిపిస్తాయి...!
వెలుగు రేఖలకైనా చోటులేని ఇరుకు ఆవాసాలలో
చీకటి రంగుతో సహవాసాలు చేస్తున్న చూపులు,
ముజాహాబ్లు అంటుకుని మసిబారిపోయిన గోడల మధ్యన
ముడుచుకుపోయి, నలగిపోయిన మనసులు ఎదురవుతాయి...!
రెక్కలు కత్తిరించి పంజరంలో పడవేయబడ్డ పక్షులు
ఊచల కమ్మీలలోంచి చూస్తుంటాయి...!
ఆంక్షలు , ఆంక్షలు.... ఎటు చూసినా అడ్డుగోడలు ...
షబాబ్ శాపం ఒంటికి చుట్టుకుంటుంది...
గరీబ్ భూతం వెంటాడుతుంది...
అరబ్ అత్తరు ఒలికి బ్రతుకు బుగ్గవుతుంది ...!!




ఫత్వా= పరిష్కారం
హిజాబ్ = బురఖా
హిసాబ్= లెక్క
ముజాహాబ్ = మతం
షబాబ్= యవ్వనం 



కన్నీరు





సంతోషాన్నిరెట్టింపు చేస్తుంది

బాధని సగం పంచుకుంటుంది

మనసు భారాన్ని తగ్గించేస్తుంది

ఒక లాలనాభరిత స్పర్శతో చెక్కిలి నిమిరి

తన ప్రేమనంతా తెలియజేస్తుంది

కంట నలుసు పడినా ఒప్పక

ఉప్పెనై ఉవ్వెత్తున ఎగసి పడుతుంది

ఎంతో సున్నితమైనది

మరెంతో స్వచ్చమైనది

జంట జాబిలుల దీపిక

కంటి కొలనులో నీరజ

నేల జారు నేత్రజ

కలల పంటకు సాగు నీరు

మృదుభావాల మూర్తీభవం

మనిషికున్న అతి పెద్ద ఆత్మీయ నేస్తం

అన్నీ తానే....






Popular Posts

.