పునర్జన్మ



మెలితిరిగి చిక్కులు పడిపోయిన చేతి గీతలను సరిచేయాలని ఉంది

అక్షరాలన్నీ చిందరవందరైన నుదుటి రాతని తిరిగి రాయాలని ఉంది

ముక్కలైపోయిన మనసుని మరల అతకాలని ఉంది

అంతరించిపోయిన అంతరాత్మకు ఆయువూదాలని ఉంది

అమ్మ కడుపులోనుంచి మరొకసారి జన్మించాలని ఉంది


ఎర్రటి చారికలు



బీటలు వారిన నేలలా...
పగిలి పోయిన అద్దంలా...
చిక్కుపడిన దారంలా...
ముక్కలైన హృదయంలా...
నీకోసం కరిగి, కన్నీరై, బరుఎక్కిన కనులలో
ఎర్రటి చారికలు
దిశలు దిశలుగా విచ్చుకుని చూస్తున్నాయి...
ఏ దిశలో నీవున్నావో తెలియక ...!!!

తన్వీ


అందాల అంగడి బొమ్మ తాను...
అంగడికే అందం తాను...
అమ్మ అనారోగ్యమో,
నాన్న అప్పుల బాధో,
ప్రేమించిన వాడి మోసమో,
పిల్లల ఆకలో,
కటుంబ భారమో,
భారమనుకున్న కుటుంబమో
చూపించిన దారిలో అలుపెరగని బాటసారి తాను...
బ్రతుకు పోరాటంలో గెలుపెరగని యోధురాలు తాను...
విలువలు లేని వీధుల్లో వెలవెలబోతుంది తాను...
రోజుకొక పేరుతో పిలువబడే అనామిక తాను...
పూటకొక కొత్త పరిమళంతో విరబూయు మల్లిక తాను..!

నిత్యం విషసర్పాలు సంచరించే శరీరం
కొన్ని కోట్ల కాట్లు వేయించుకుంటుంది!
సగం కాలిన సిగరెట్ట్టు పీకలతో
అదనపు సింగారాలు చేయించుకుంటుంది!
చీకటి సాక్షిగా చిద్రమైపోతున్న బ్రతుకు
కొన్ని వేలసార్లు చచ్చిపోతుంది!
పందిరి మంచానికి కట్టిన పూల మాలలకి
అంతరాత్మ ఉరేసుకుని వేళాడుతుంది!
మగ కత్తుల వేటుకి తెగి పడుతున్న మానాన్ని చూసి
మనసు మౌనంగా రోదిస్తుంది!
పీడ కలల్ని పొదవుకున్నతన కళ్ళు...
ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చలేవు!
రహస్యమంటూ ఎరుగని తన ఒళ్ళు...
పక్క మీద తప్పా పనికిరాదు!!

తానొక అలౌకిక..
తానొక పరాజిత..
తానొక విధి వంచిత...
తానొక అనర్ధ అశాతీత అనాధ..!!





అంతర్మధనం


ఆశ నిరాశల అంతర్మధనం
అందిస్తోంది హాలాహలం
నిండిపోతోంది నా గుండె గరళం
రమ్మనంటోంది నన్ను మరణం






నేను అసంపూర్ణుడను





అసంపూర్ణమైన  అక్షరాలతో నా విధిరాత  లిఖించబడింది.
అసంపూర్ణమైన  అవయవాలు  నాకు అమర్చబడినాయి.
అసంపూర్ణంగా పుట్టి, అసంపూర్ణంగా పెరిగి,
 ‘అసంపూర్ణుడి’గా  ముద్రించబడ్డాను.
కన్నవాళ్ళకి నేనొక పరువునష్టాన్ని!
తోడబుట్టినవాళ్ళకి బ్రతుకు భారాన్ని!!
నాకు పేరు లేదు, ఊరు లేదు, సమాజంలో చోటు లేదు.
నన్ను అక్కున చేర్చుకోని ఈ సమాజం...
నన్ను ‘లెక్క’ చేయని ఈ సమాజం...
నా హక్కులను మాత్రం లాగేసుకుంది!!
నా శరీరమొక వినోద వస్తువు
నా వేషమొక వింత జంతువు
గుర్తింపు లేని నా ముఖం పైన
నా భావాలను కనిపించనియ్యక ఉండేందుకు
 రకరకాల రంగులతో కప్పుతాను
అసంపూర్ణమైన ఈ శరీరంలో సంపూర్ణమైన మనసొకటుంది
అది నవ్వుతుంది...
ఏడుస్తుంది...
ఆశపడుతుంది....
ఎన్నెన్నో భావాలను మోస్తుంది....!
కొన్ని వేలసార్లు ముక్కలవుతుంది...!!
కానీ... దాని ఆచూకి కనుగునేదెవ్వడు?
దాని గోడు వినేదెవ్వడు?
రోజూ ఎన్నో రకాల చూపులు నన్ను తాకుతాయి
ఆకలిగా చూసేవి, అసహ్యంగా చూసేవి,
అలవాటుగా చూసేవి, ఆటపట్టింపుగా చూసేవి,
ఎన్నో, ఎన్నెన్నో చూపులు నా శరీరంగుండా దూసుకెళతాయి
కానీ... నా కళ్ళు మాత్రం ...
నన్ను కూడా ‘మనిషి’గా చూసే చూపు కోసం వెతుకుతాయి
వెతికి వెతికి అలిసిపోయి, నీరైపోయి 
ఏ ‘పరిపూర్ణుడి’ మంచం మీదనో ఇంకిపోతాయి!!








నీకు తెలుసా...



ఎంత  కన్నీరు  కార్చానో..

కనుపాపలలో  నీ రూపాన్ని  కరిగించేందుకు!

ఎంత వ్యధనోర్చానో..

ఎదలోని  నీ జ్ఞాపకాలని  చేరిపివేసేందుకు!

ఎన్నిసార్లు  ఆహుతయ్యానో..

అంతరాత్మలో   నీ అస్తిత్వాన్ని  ఆర్పివేసేందుకు!

ఎన్నిస్సార్లు  మరణించానో..

మదిలోని  ప్రేమను  మరిచిపోయేందుకు!!



Popular Posts

.