ప్రియమైన నీకు, ప్రేమతో నేను...





ప్రియమైన నీకు,

నిన్నటి నీ లేఖ ఇప్పటికి అసంఖ్యాకంగా చదువుకున్నాను..!
 (అందులోని నీ ముద్దులని కూడా...)
లేఖను విప్పగానే నా చుట్టూ ఒక సుమనోహరోద్యానవనం పరుచుకుంటుంది
నీ అక్షరాల పూవులన్నీ నా ఎదపై జారిపడి, ఒళ్ళు జల్లుమనిపించి, గొల్లున నవ్వుతాయి 
ఆ తన్మయత్వంతో నా అరమోడ్పు కన్నులు నీ పదాల అల్లిక వెంట పరుగుతీస్తాయి 
ప్రతి అక్షరంలోనూ కురిసేటి ప్రణయ జల్లులో నా హృది తడిసి ముద్దవుతుంది
ముద్దులొలుకు నీ చేతి రాత చూసి నా మెడలోని ముత్యాల హారం వెలవెలబోతుంది
నీ తేనెల మాటల ఊటలో మనసు మునిగి తేలుతుంది 
కుహూరవేదో నా చెవిలో నీ వేణువూది పోతుంది 

అంతలోనే అంతులేని దిగులేదో వచ్చి కమ్ముకుంటుంది 
నీవు వచ్చే రోజు కోసం నా మనసు అనుదినం ఆరాటపడుతుంది.
నిన్ను చూసే క్షణం కోసం నా కళ్ళు ప్రతి క్షణం కలవరిస్తున్నాయి
కలవరింతల కాలం నాలో కలత రేపి కునుకు రానీయకుంది 
స్వప్నదీపికలు కొడిగట్టి నిన్ను చూపకున్నాయి 
ఎదురుచూపుల ప్రవాహంలో ప్రతిరోజూ ఈదులాడుతాను
ఈ విరహ వేదనింక ఎటులోర్తునని నా ఎద నాకే ఎదురుతిరుగుతోంది

ఉషోదయాన నీ వదనారవిందము తిలకించు భాగ్యమెపుడో కదా..!
తుషారకరుని నిశాలను నీతో కలిసి ఆస్వాదించు పూర్ణిమెపుడో కదా..! 
నీ రాక తెలుపు చిరుగాలుల చలనాల స్పర్శ ఏనాటికో కదా..! 
మన మన్దీపికల వెలుగులో ఇరువురి మరీచికలొకటై
 మంజుల నందనము చేయు నిమిషమెపుడో కదా..!

 మది తృష్ణ తీర్చు చిరుజల్లులు నీ లేఖలు 
 ప్రతీక్ష పూరించు పండు వెన్నెలలు నీ లేఖలు 
కదంబవాయువుల చేత కబురంపుట మరువకుమా.....
నీ ఆలింగనైశ్వర్యములకై నిరీక్షించుచు.....


-ప్రేమతో నేను 

నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను....!!



నా చుట్టూ ఎడారిని పరిచి 
నవవసంతం నడిచి వెళ్లిపోతుంటే...
ఎండమావి యెదలో నీ రూపం...
నా జన్మాదిలో నిన్ను ప్రేమించిన జ్ఞాపకం...
మది మూలాలు వెతుకుతుంటే 
నిధిలా నువ్వు దొరుకుతున్నావు!
నిన్ను అందుకోవాలని పరిగెడుతుంటే
ఇసుక ఊబులు నోళ్ళు తెరుచుకుని నిలబడుతున్నాయి!
తమలోకి నన్ను లాగుతున్నాయి!
నా పైన మేఘాలు... రాకాసి రాబందులవలె మేఘాలు...
ఒక్క చినుకైన రాల్చలేని చిక్కటి మేఘాలు...!
నల్లటి చీకటి కమ్ముకుని మింగివేస్తుంటే...
నా జన్మాంతంలోనూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను....!!

మధురమైన ఎదురుచూపు







ఎదురుచూపెంత మధురం....!
ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను...
ఈ ఎదురుచూపుల ఉరవడితో 
బరువెక్కిన కనురెప్పలమాటున
నువ్వు కదలాడుతుంటే...
కనులు మూసి నిన్ను చూడాలో
కనులు తెరిచి ఎదురుచూడాలో
తెలియక సతమతమైపోయే 
నన్ను చూసి నవ్వుకుంటావు..!

నాకు మాత్రం... నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి 
ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది...
నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది!
నువ్వే ఒక అద్భుతానివి!!
నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు...
ఇకనైనా నా చెంతకు చేరి 
ఆ ఎడబాటుని, ఎడురుచుపుని చెరపనివ్వు ....


అగరొత్తు పొగ



సృష్టిలోని మొదటి అద్భుతం 
నిమిషమైన లేని జీవితం
క్షణక్షణానికీ మారే రూపం 
హోయలోలికే సోయగం
అందులోనే ఎంతో అందం
ఆహ్లాదభరిత పరిమళం 
అంతా అగరొత్తు పొగ సొంతం

తన చుట్టూ ఉన్నవారందరికీ 
అరనిమిషంలో ఆనందాన్ని పంచి
మరుక్షణంలో మాయమైపోతుంది... 
బంధనాలకి అందకుండా 
స్వేచ్ఛావాయు విహారియై 
ఉత్సాహంగా ఊరేగుతుంది... 

వర్ణం, రూపం, భారం ఏదీ లేని ఒక మాయాజాలం... 
శూన్యం మీద సమీరం గీసిన ఒక ఛాయాచిత్రం...
అరనిమిషపు ఆయువైనా.. అది పరిపూర్ణం, పవిత్రం, సార్ధకం...
అటువంటి అరనిమిషపు అగరొత్తు పొగై పుట్టేందుకు
ఇటువంటి 'మర'మనిషి జన్మ ఎన్నిసార్లు ఎత్తాలో!!


ఆ అగరొత్తు పోగనే నేనైతే!
ఆ స్వేచ్ఛావాయువే ఊపిరైతే!
ఆ సేవాభావమే ప్రాణమైతే!
ఆ అద్భుతానంద అరనిమిషపు జీవితమే నాదైతే!
ఆహా..! నా జన్మ ధన్యమే కాదా...!
అంతకన్నా గొప్ప వరమొకటున్నదా...!

ఋతురాగం ...




ఆరు ఋతువులు ఒక్కసారిగా ఆలపించిన రాగమేదో
మదిని మునకలేసేటి ఈ వేళ 
ఏమని చెప్పను ఓ నేస్తమా.... నా ఈ భావావేశమెట్టిదో...!

అనుభవాల అల్లికలో గతాన్ని వెతికే ప్రయత్నం... 
శరద్కాలపు వెన్నెల వీధిలో మేఘాన్వేషణా విధం! 
అర్ధంలేని ఆవేశపు జ్వాలలు దహించివేసే కోపం... 
గ్రీష్మ తాపం చెలరేగు నింగిలో ప్రభాకరుని ప్రతాపం!
అడియాశల అంచులలో వ్రేళ్ళాడు వేదన...
శిశిరం చుట్టుముట్టిన చీకటి శోధన!
ప్రేమామృత జల్లులు కురిసే చల్లని వేళ...
వర్షించే వయ్యారి వెండి మబ్బుల హేళ!
తొలి తొలి ఊహలు ఉదయించు పరువం...
పసి పసి హేమంతం కమ్ముకొను మరువం!
ఆలోచనా చినుకులు కురిసి మొలకెత్తు ఆశలు...
వసంతపు వేకువలో ముంగిట విరిసిన ముగ్గులు! 

సంగీతమెరుగని ఈ ఋతురాగాల స్వరాలాపనలో
మర్మమంటూ లేని ఈ మది భావాల మల్లె మాలికలో
ఊయలూగు నా ఈ భావావేశమెట్టిదో 
ఏమని చెప్పను ఓ నేస్తమా.... !!


"మనసు"




ఒక ఉహ....
ఆ ఉహ పేరు "మనసు"
ఎంత అందమైనదా ఉహ!
ఎంత విచిత్రమైనదా ఉహ!
ఎంత నిబ్బర, నిశ్చలమైనదా ఉహ!
ఎక్కడిది ఆ ఉహకంత శక్తి!?
ఎవరిస్తారు దానికా స్పూర్తి!?
ఎన్ని దెబ్బలు తగులుతాయి...
ఎన్నిసార్లు ముక్కలవతుంది...
ఎంత నెత్తురోడుతుంది...
అయినా....
 ఎలా వస్తుందో తనకి ఓపిక!!
ఎలా నిలుస్తుందో తనకి ప్రాణం!!

అగ్ని శిఖవుతుంది ఒక క్షణం..
మంచు ముద్దవుతుంది మరుక్షణం..
అంతలోనే అవమాన పడుతుంది..
వెంటనే అభిమానం కురిపిస్తుంది..
మోడువారినంతలోనే చిట్టి చిగురేదో మెరుస్తుంది..
ఎడారైపోయిందనుకుంటుండగానే స్వాతి చినుకేదో కురుస్తుంది.. 
ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నానంటూ వస్తుంది..
ఏకాంతం కోరుకుంటే మాటాడకుండా వెళ్ళిపోతుంది..
ఒక చిన్ని మనసుకి ఇన్ని మహిమలెలా సాధ్యమో!!
మనిషికి మనసే ఆధారం, మనసే ఆయుధం
మనిషిగా బ్రతికేందుకు మనసే అర్హత
బహుశా మనసు ఉహ కాదేమో...!
మనిషి మనుగడకు ఆటంకం రానివ్వక దోహదపడు
ఒక అతీతమైన, విశ్వవ్యాప్తమైన శక్తి కావొచ్చు...! 


July 08, 2011 - , 8 comments

స్వీయ






తను నా ఆత్మీయ నేస్తం.. ఆజన్మాంత స్నేహం...
మనోభావ సౌరభాల కుసుమ మనసు
వెన్నెల రువ్వే వెండి వెలుగుల నవ్వు కలబోత తాను...
తనతో నా స్నేహం మధురాతి మధురం...మాటలకందని భావం..
ఎన్నో జ్ఞాపకాలు ఇంకెన్నో మధురానుభూతుల కలయిక మా స్నేహం...
పసితనపు పరిమళాలను నా చుట్టూ నింపి
మరో బాల్యాన్ని చవిచూపించిన చిన్నారి నేస్తం తాను...
అల్లరి చేయటమే విధిగా రోజులు గడిపినా
గమ్యం ఎరుగకపోయినా ప్రయాణం చేసినా
ఎర్రటి రసగుల్ల కొనుక్కు తిన్నా
అన్నం ముద్దలు పంచుకున్నా
అహంకారాలు పెంచకున్నా
మనసారా నవ్వుకున్నా
కడుపారా ఏడ్చినా
అన్ని తనతోనే...


అంతులేని ఎదలోతులను కంటి చూపుతోనే కొలిచేస్తుంది..
అంతలోనే ఎత్తుకోమని మారాం చేసే చంటి పాపైపోతుంది!
ఎంతవారినైనా లెక్కచేయని తెగువ చూపుతుంది..
వింతగా చిన్న విషయాలకి కన్నీరు పెడుతుంది!!
ఎన్నని చెప్పను... ఏమని చెప్పను...!!
తనతో గడిపిన ప్రతిక్షణం ఒక ఆణిముత్యం...
ఆనందమే అనునిత్యం...
ప్రతిరొజూ ఒక పగడపు హారం...
నాకు మాత్రమే దొరికిన వరం...



ఆశల అలలు....

        
            

వినీలాకాశంలో విహరించు విహంగపు రెక్కలలోని స్వేచ్చను నేనై

నిన్ను చేరుకోనా...
సంద్రమును దాటి పరవళ్ళు త్రొక్కు సెలయేటి 
వేగము నేనై
నిన్ను తాకిపోనా...
మలయమారుతమ్మును మోసుకునిపోవు చల్లగాలి చలువను నేనై
నిన్ను చుట్టుకోనా...
నింగి నేల ముద్దిడు అంచున విరిసే తొలిసంధ్య వెలుగును నేనై
నిన్ను చుంబించనా...
వెండి మబ్బుల మదిలో మెరిసి కురిసే పసిడి ధారల చినుకు నేనై
నిన్ను తడిపేయనా...
జిలుగు పూల తోటలో విరబూసిన జాబిలమ్మ 
వెన్నెల నేనై
నిన్ను తడిమేయనా...
కొత్త చిగురు వేసిన కోకిలమ్మ గొంతులోని తీపి రాగాల గీతం నేనై
నిన్ను పెనవేయనా ...


Popular Posts

.