ఎగిరి పోవే మనసా...




నేల పైనే నింగి సాక్షాత్కరిస్తుంది
నింగి అంచులలో నడచినట్టు తోస్తుంది
నవ్వు కూడా నదివెల్లువైపోతుంది
ఊహలన్నీ పాలపిట్టలై పరుగులు తీస్తాయి
పలుకులన్ని పారిజాతాలల్లె పరిమళిస్తాయి
రంగులు రంగులు
ఎటు చూసినా రంగులు
కనులకంతా విందులు
ఉదయపు తొలికిరణం మొదలు
రేయి మలిఘడియ వరకూ అంతా ఆనందం
ఏదో తెలీయని తారంగం
వేసవిలోనైనా చలిమంట వేసే వెర్రి వయసుతో కూడి
మతిలేని మనసు చేసే వీరంగం
అంతా కోలాహలం
అర్ధంకాని గందరగోళం
అందమైన రెండక్షరాల పదం ఆడే ప్రణ(ళ)య తాండవం
ఆ ప్రళయ కాల అలలు చుట్టుముట్టి
ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరిని లాగి మింగేసినప్పుడు
నాడులన్ని స్థంబించి
బీటలువారిన గాజు హృదయం ముక్కలుగా పగిలినప్పుడు
ఆ ముక్కలనే రెక్కలుగా చేసి పైకెగరగలిగితే
ఆత్మవిశ్వాసమే ఆయువై
ఆత్మాభిమానమే ధైర్యమై
సాగే ఆ పయనానికి ఆకాశమే హద్దు . . !


1 comments:

Post a Comment

Popular Posts

.