ఇవాళ నాన్న నాకు
కొత్తగా కనిపిస్తున్నారు!!
నాకు నడక నేర్పిన
నాన్న
ఇప్పుడు నేను
మరొకరితో ఏడడుగులు నడుస్తుంటే ఆనందంగా
చూస్తున్నారేం?
నా చేయి
పట్టుకుని నన్ను జాగ్రత్తగా నడిపించిన నాన్న
ఇప్పుడా చేతిని
మరొకరి చేతిలో పెడుతున్నారేం?
నాకు నాన్నైనా,
నన్ను “అమ్మా” అని పిలిచే నాన్న
వచ్చే యేడుకి
అమ్మనవమని కొత్తగా దీవిస్తున్నారేం?
నన్ను చూడకుండా
ఒక్కరోజైనా ఉండలేక
చుట్టాలింటికి
కూడా పంపించని నాన్న
ఇప్పుడు ఏ
చుట్టరికం లేనివారింటికి పంపిస్తున్నారేం?
ఇదీ మన ఇంటిపేరు
అని నాన్నే చెప్పారు
కానీ ఇప్పుడు నా
ఇంటిపేరు అది కాదట!
నేను ‘నాన్న
కూతుర్న’ని అందరూ అనేవారు
కానీ ఇప్పుడు
నేను ‘ఆయన’ భార్యనట!!
ఒక్క పెళ్ళితో
ఎన్ని మార్పులు!!
అప్పగింతల వేళ...
నన్నెందుకు
ఇంట్లోనుంచి పంపించేస్తున్నారు?
నేనేమైనా తప్పు
చేశానా నాన్నా...?? అని అడుగుదామనుకున్నాను
కానీ, నాన్న
కళ్ళల్లో నీళ్ళు చూసి ఆగిపోయాను
నానమ్మ
చనిపోయినప్పుడు కూడా నిబ్బరంగా ఉన్న నాన్న కళ్ళల్లో నీళ్ళు!!
అయినా కూడా నాన్న
ముఖంలో ఏదో సంతోషం..
‘ఆయన’కి
నన్నప్పగిస్తూ మెల్లగా నవ్వారు..
ఆ నవ్వులో ఒక
ధైర్యం, ఒక నమ్మకం...
నా భయాలకి, బాధకి
సమాధానం చెబుతున్నట్టుగా....