దేహాత్మైక్యం




దేహపు పొరల్లో, ఆత్మకు అతి చేరువలో నిఘూడమై ఉన్న
కాంక్షను నిద్దురలేపి, ఊపిరినూది, అణువణువునా ప్రవహింపజేసి,
తను నా రక్తకణాలని ఉత్తేజపరిచిన క్షణం.....
నేను నా రహస్యాలను ఒక్కొక్కటిగా తనకు అప్పజెప్పేసి,
తన తనుమనః ఆలంబనలో లీనమై... లయమైపోతాను...!
ఆ ఆలింగన ముడిలో చిక్కుపడిన శ్వాసలను
మరింతగా పెనవేసుకుని.....
మోహపు రూపమై, విరహపు వారధులు దాటి
స్పర్శలు రగిల్చిన వేడిలో కరిగి....
ఘనీభవించిన హిమాలయపు అంతర్భాగమున
జనియించి, అధోభాగమున ప్రవహించు
మానస సరోవరములో మునకలేసి....
ముక్తాత్మనై, మోక్షసిద్ధినై తరిస్తాను..!!

భగ్నహృదయం



ఈ తగువేమిటే మనసా..?
నాపై ఈ పగేమిటే మనసా...?
అందని దానికై ఆశ పడతావు...
ఆశ నిరాశల నడుమ నలుగుతావు..!
నిప్పని తెలిసీ ముట్టుకుంటావు...
భరించలేక భగ్నమైపోతావు..!
ఊహల ఉయ్యాలలూగుతావు...
తెగి పడిన కలల తీగలలో చిక్కుకుని నెత్తురోడుతావు..!
చేత ఉన్నదాన్ని జారవిడుచుకుంటావు...
చేరలేని దానికై పరుగందుకుంటావు..!
ప్రణయమనుకుని భ్రమసేవు...
ప్రళయమని తెలిసి వగచేవు..!
తప్పులన్నీనువ్వు చేస్తావు...
నిందలేమో నాపై మోపుతావు..!
ఇది నీకు న్యాయమా!?
ఇదే నీ ధర్మమా!?
చెప్పవే ఓ నా వెర్రి హృదయమా!!
మాట వినని మొండిఘటమా!!!





Popular Posts

.