నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను....!!



నా చుట్టూ ఎడారిని పరిచి 
నవవసంతం నడిచి వెళ్లిపోతుంటే...
ఎండమావి యెదలో నీ రూపం...
నా జన్మాదిలో నిన్ను ప్రేమించిన జ్ఞాపకం...
మది మూలాలు వెతుకుతుంటే 
నిధిలా నువ్వు దొరుకుతున్నావు!
నిన్ను అందుకోవాలని పరిగెడుతుంటే
ఇసుక ఊబులు నోళ్ళు తెరుచుకుని నిలబడుతున్నాయి!
తమలోకి నన్ను లాగుతున్నాయి!
నా పైన మేఘాలు... రాకాసి రాబందులవలె మేఘాలు...
ఒక్క చినుకైన రాల్చలేని చిక్కటి మేఘాలు...!
నల్లటి చీకటి కమ్ముకుని మింగివేస్తుంటే...
నా జన్మాంతంలోనూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను....!!

మధురమైన ఎదురుచూపు







ఎదురుచూపెంత మధురం....!
ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని
ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను...
ఈ ఎదురుచూపుల ఉరవడితో 
బరువెక్కిన కనురెప్పలమాటున
నువ్వు కదలాడుతుంటే...
కనులు మూసి నిన్ను చూడాలో
కనులు తెరిచి ఎదురుచూడాలో
తెలియక సతమతమైపోయే 
నన్ను చూసి నవ్వుకుంటావు..!

నాకు మాత్రం... నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి 
ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది...
నీకు అది కూడా అపురూపంగానే తోస్తుంది!
నువ్వే ఒక అద్భుతానివి!!
నీ అపురూప, అద్భుత ప్రేమలో నన్ను తడవనివ్వు...
ఇకనైనా నా చెంతకు చేరి 
ఆ ఎడబాటుని, ఎడురుచుపుని చెరపనివ్వు ....


అగరొత్తు పొగ



సృష్టిలోని మొదటి అద్భుతం 
నిమిషమైన లేని జీవితం
క్షణక్షణానికీ మారే రూపం 
హోయలోలికే సోయగం
అందులోనే ఎంతో అందం
ఆహ్లాదభరిత పరిమళం 
అంతా అగరొత్తు పొగ సొంతం

తన చుట్టూ ఉన్నవారందరికీ 
అరనిమిషంలో ఆనందాన్ని పంచి
మరుక్షణంలో మాయమైపోతుంది... 
బంధనాలకి అందకుండా 
స్వేచ్ఛావాయు విహారియై 
ఉత్సాహంగా ఊరేగుతుంది... 

వర్ణం, రూపం, భారం ఏదీ లేని ఒక మాయాజాలం... 
శూన్యం మీద సమీరం గీసిన ఒక ఛాయాచిత్రం...
అరనిమిషపు ఆయువైనా.. అది పరిపూర్ణం, పవిత్రం, సార్ధకం...
అటువంటి అరనిమిషపు అగరొత్తు పొగై పుట్టేందుకు
ఇటువంటి 'మర'మనిషి జన్మ ఎన్నిసార్లు ఎత్తాలో!!


ఆ అగరొత్తు పోగనే నేనైతే!
ఆ స్వేచ్ఛావాయువే ఊపిరైతే!
ఆ సేవాభావమే ప్రాణమైతే!
ఆ అద్భుతానంద అరనిమిషపు జీవితమే నాదైతే!
ఆహా..! నా జన్మ ధన్యమే కాదా...!
అంతకన్నా గొప్ప వరమొకటున్నదా...!

ఋతురాగం ...




ఆరు ఋతువులు ఒక్కసారిగా ఆలపించిన రాగమేదో
మదిని మునకలేసేటి ఈ వేళ 
ఏమని చెప్పను ఓ నేస్తమా.... నా ఈ భావావేశమెట్టిదో...!

అనుభవాల అల్లికలో గతాన్ని వెతికే ప్రయత్నం... 
శరద్కాలపు వెన్నెల వీధిలో మేఘాన్వేషణా విధం! 
అర్ధంలేని ఆవేశపు జ్వాలలు దహించివేసే కోపం... 
గ్రీష్మ తాపం చెలరేగు నింగిలో ప్రభాకరుని ప్రతాపం!
అడియాశల అంచులలో వ్రేళ్ళాడు వేదన...
శిశిరం చుట్టుముట్టిన చీకటి శోధన!
ప్రేమామృత జల్లులు కురిసే చల్లని వేళ...
వర్షించే వయ్యారి వెండి మబ్బుల హేళ!
తొలి తొలి ఊహలు ఉదయించు పరువం...
పసి పసి హేమంతం కమ్ముకొను మరువం!
ఆలోచనా చినుకులు కురిసి మొలకెత్తు ఆశలు...
వసంతపు వేకువలో ముంగిట విరిసిన ముగ్గులు! 

సంగీతమెరుగని ఈ ఋతురాగాల స్వరాలాపనలో
మర్మమంటూ లేని ఈ మది భావాల మల్లె మాలికలో
ఊయలూగు నా ఈ భావావేశమెట్టిదో 
ఏమని చెప్పను ఓ నేస్తమా.... !!


"మనసు"




ఒక ఉహ....
ఆ ఉహ పేరు "మనసు"
ఎంత అందమైనదా ఉహ!
ఎంత విచిత్రమైనదా ఉహ!
ఎంత నిబ్బర, నిశ్చలమైనదా ఉహ!
ఎక్కడిది ఆ ఉహకంత శక్తి!?
ఎవరిస్తారు దానికా స్పూర్తి!?
ఎన్ని దెబ్బలు తగులుతాయి...
ఎన్నిసార్లు ముక్కలవతుంది...
ఎంత నెత్తురోడుతుంది...
అయినా....
 ఎలా వస్తుందో తనకి ఓపిక!!
ఎలా నిలుస్తుందో తనకి ప్రాణం!!

అగ్ని శిఖవుతుంది ఒక క్షణం..
మంచు ముద్దవుతుంది మరుక్షణం..
అంతలోనే అవమాన పడుతుంది..
వెంటనే అభిమానం కురిపిస్తుంది..
మోడువారినంతలోనే చిట్టి చిగురేదో మెరుస్తుంది..
ఎడారైపోయిందనుకుంటుండగానే స్వాతి చినుకేదో కురుస్తుంది.. 
ఒంటరిగా ఉన్నప్పుడు నేనున్నానంటూ వస్తుంది..
ఏకాంతం కోరుకుంటే మాటాడకుండా వెళ్ళిపోతుంది..
ఒక చిన్ని మనసుకి ఇన్ని మహిమలెలా సాధ్యమో!!
మనిషికి మనసే ఆధారం, మనసే ఆయుధం
మనిషిగా బ్రతికేందుకు మనసే అర్హత
బహుశా మనసు ఉహ కాదేమో...!
మనిషి మనుగడకు ఆటంకం రానివ్వక దోహదపడు
ఒక అతీతమైన, విశ్వవ్యాప్తమైన శక్తి కావొచ్చు...! 


July 08, 2011 - , 8 comments

స్వీయ






తను నా ఆత్మీయ నేస్తం.. ఆజన్మాంత స్నేహం...
మనోభావ సౌరభాల కుసుమ మనసు
వెన్నెల రువ్వే వెండి వెలుగుల నవ్వు కలబోత తాను...
తనతో నా స్నేహం మధురాతి మధురం...మాటలకందని భావం..
ఎన్నో జ్ఞాపకాలు ఇంకెన్నో మధురానుభూతుల కలయిక మా స్నేహం...
పసితనపు పరిమళాలను నా చుట్టూ నింపి
మరో బాల్యాన్ని చవిచూపించిన చిన్నారి నేస్తం తాను...
అల్లరి చేయటమే విధిగా రోజులు గడిపినా
గమ్యం ఎరుగకపోయినా ప్రయాణం చేసినా
ఎర్రటి రసగుల్ల కొనుక్కు తిన్నా
అన్నం ముద్దలు పంచుకున్నా
అహంకారాలు పెంచకున్నా
మనసారా నవ్వుకున్నా
కడుపారా ఏడ్చినా
అన్ని తనతోనే...


అంతులేని ఎదలోతులను కంటి చూపుతోనే కొలిచేస్తుంది..
అంతలోనే ఎత్తుకోమని మారాం చేసే చంటి పాపైపోతుంది!
ఎంతవారినైనా లెక్కచేయని తెగువ చూపుతుంది..
వింతగా చిన్న విషయాలకి కన్నీరు పెడుతుంది!!
ఎన్నని చెప్పను... ఏమని చెప్పను...!!
తనతో గడిపిన ప్రతిక్షణం ఒక ఆణిముత్యం...
ఆనందమే అనునిత్యం...
ప్రతిరొజూ ఒక పగడపు హారం...
నాకు మాత్రమే దొరికిన వరం...



ఆశల అలలు....

        
            

వినీలాకాశంలో విహరించు విహంగపు రెక్కలలోని స్వేచ్చను నేనై

నిన్ను చేరుకోనా...
సంద్రమును దాటి పరవళ్ళు త్రొక్కు సెలయేటి 
వేగము నేనై
నిన్ను తాకిపోనా...
మలయమారుతమ్మును మోసుకునిపోవు చల్లగాలి చలువను నేనై
నిన్ను చుట్టుకోనా...
నింగి నేల ముద్దిడు అంచున విరిసే తొలిసంధ్య వెలుగును నేనై
నిన్ను చుంబించనా...
వెండి మబ్బుల మదిలో మెరిసి కురిసే పసిడి ధారల చినుకు నేనై
నిన్ను తడిపేయనా...
జిలుగు పూల తోటలో విరబూసిన జాబిలమ్మ 
వెన్నెల నేనై
నిన్ను తడిమేయనా...
కొత్త చిగురు వేసిన కోకిలమ్మ గొంతులోని తీపి రాగాల గీతం నేనై
నిన్ను పెనవేయనా ...


జీవిత సత్యాలు







బంధాలు...
బాధల్ని మిగుల్చు సాధనాలు! 
ప్రేమలు...
మనసుని పీడించు పిశాచాలు !
ఆప్యాయతలు...
అందమైన అబద్దాలు!
ఆశలు...
ఆలోచనలని హతమార్చు ఆయుధాలు!
మనుషులు...
మనసులతో పనిలేని యంత్రాలు! 
మనసులు...
మనుషులకి స్థానం లేని ప్రాంతాలు!

రాధావల్లభుని రాకకై....




మేఘాంబర మేలి వస్త్రం ధరించి 

స్మర్యంత్ర సింధూరం నుదుటిన దిద్ది 

హరిమోహన హారాలతో అలంకరించుకుని

కన్దర్పకుహలీ వనాన కోకిల గానం చేస్తుండగా

వెన్నెల వీధిలో వెండంచు మబ్బులు విహరిస్తుండగా

సంపెంగ సువాసనల సమీరాలు వీస్తుండగా

రాగిణీ పుష్పాల మాల కడుతూ


రాధారాణి నీ రాకకై ఎదురుచూస్తుంది...




మదనమోహన మురళీగానం మదిని తాకిన


మైమరచి ఆడే మయూరాలు నీ రాకని తేలపకనే తెలుపుతున్నాయి 

హంసగంజన సవ్వడులు కలఝంకారాలతో కలసి


నీ అల్లన మెల్లని అడుగుల సడిని వినిపిస్తున్నాయి 

నీవు రాగానే నీ హృదయమోదన స్థానంలో తలవాల్చి


కనులుమూసి కలవరించి

తనువు మరిచి పులకరించి

తనలోని ప్రేమనంతా నీకు అర్పించాలని


గోవింద ప్రణయధార హృదయం ఎగసి పడుతున్నది...





నీ సంతోషం




'ఎలా ఉన్నావ్' అని  నన్నెవరో అడిగారు.. 
"తను బావున్నాడు" అని నేను బదులిచ్చాను!!

జాబిలి




నా జ్ఞాపకాల సాగరంలో నేను జారవిడుచుకున్న జాబిలి నువ్వు..!! 

ప్రశ్న



బదులు తెలియని ప్రశ్నలా ఉన్న నేను నీ ప్రేమలో బదులే లేని ప్రశ్నలా మిగిలిపోయాను..!!

నల్లటి ఇంద్రధనస్సు



తెల్లకాగితమంటి నా ఎదపై నువ్వు రాసిన ఈ నల్లటి కవిత 
చెరిపినా చెరగని పచ్చబొట్టై నా మదిలో గుచ్చుకొనగా...
నీలాల నా కళ్ళలో ఎర్రటి రక్తకన్నీరు ఎగసిపడి 
పసిడి పసుపు పసి మనసులో సప్తవర్ణశోభితమైన ప్రేమ మసకబారిపోయింది...!!

జీవితకాల జ్ఞాపకాలు....!


నా లేత నడుము చుట్టూ నీ చేతులు అల్లిన లతలు....
నా మెడపై నీ ముంగురులు పెట్టిన ముద్దులు....
నా చెంపలకు నీ పెదవులు అద్దిన కెంపులు....
నా పెదవంచున నీ వేలికొన వేసిన ముగ్గులు....
నా ఎదపై నీ కళ్ళు రాసిన కవితలు....

నా గతజన్మ స్వప్నాలు... జీవితకాల జ్ఞాపకాలు....!!

Popular Posts

.