నిన్న వచ్చిన వెన్నెల


నిన్న వచ్చిన వెన్నెలవేనా నువ్వు!
ఇంతటి కాంతి మునుపెన్నడూ నేను చూడలేదు...
బహుశా ఈ కాంతి నాలోనిదేనేమో!
నాలో నువ్వు నింపినదేనేమో!!
అదేమి విడ్డూరమో మరి
పగలంతా వగలు పోతూ ఉంటుంది
పొద్దుపొడుస్తూనే సెగలు పెడుతూ ఉంటుంది
ఆ సెగలలో నాలో నేనే జ్వలించి, నీకై తపించి 
కరిగిన రేయిపై తేలియాడతాను
పొద్దుపొడుస్తుంది....
వగలు పోతూ నీ వెన్నెల వస్తుంది....!

సుశీల


నేను పసిపాపను...

తన నరాల బాధ తగ్గించినందుకు 
నా తల్లికి ఏ మగాడో ఇచ్చిన కానుకను.
పగలు పాల కోసం, రాత్రి జోల కోసం 
అలమటించిన అర్ధ అనాధను.
గాజుల గలగలల మధ్య వినపడే నా ఏడుపు విన్నప్పుడు 
నా తల్లి కంట రాలిన రక్త కన్నీటి బొట్టును.
ఏ ధారలోనివో తెలియని తోటి అణువుల మధ్య 
పెరిగిన అభాగ్య అణువును.


నేను ప్రమదను...

మాలలోను, మంచంలోను నలిగిపోయెందుకే
విచ్చుకున్న మల్లెమొగ్గను.
దీపాలవేళ వీచే హోరుగాలిలో పెనుగులాడి 
ఆరిపోయే అగ్నిశిఖను. 
అమ్మ నేర్పిన చీకటి చదువులో రూపు"దిద్దుకున్న

అనాకార అక్షరమును.


నేను అమ్మను

అమ్మలాగానే అమ్మనైన అమ్మను
మా అమ్మని కన్న అమ్మను
ఆడతనం అమ్మకానికి పెట్టి
అమ్మతనం కొనుక్కున్న అమ్మను
నేను అమ్మను.! అమ్మను గాక అమ్మను.!!
నా బిడ్డను ఈ అంగడిలో అమ్మను
బేరసారాల బ్రతుకు బాటలో నా బిడ్డను నడపను
తరతరాల వెలుగు వెతుకులాటలో వదిలివేయను
జన్మనిచ్చాను. జీవితాన్నీ ఇస్తాను.

నేను సుశీలను!
మూడు తరాల తలరాతను మార్చుతున్న త్రిశూలను!!!




కుండ బద్దలుకొట్టేద్దాం



కాసేపు మనల్ని మనం చూసుకుందాం
ఒక్కసారి ముసుగులన్నీ విప్పి నగ్నంగా నిలబడదాం
మనతో మనమే మాట్లాడుకుందాం
మనలో మనమే తర్కించుకుందాం
మనల్ని మనమే పోల్చుకునే ప్రయత్నం చేద్దాం
నాకు కనిపించే నిన్నూ, నీకు కనిపించే నన్నూ తరిమి తరిమి కొడదాం
నీకు మాత్రమే కనిపించే నిన్నూ, నాకు మాత్రమే కనిపించే నన్నూ ఎదురెదురుగా నిలబెడదాం
నేనెవరని ప్రశ్నించుకుందాం, వచ్చే సమాధానాన్ని ధైర్యంగా విందాం
పచ్చి నిజాన్ని తాగుదాం... గరళమో, అమృతమో అరాయించుకుందాం
వెంట తిప్పుకుంటున్న నీడల్ని ఈరోజుకి కుక్కల బోనులో కట్టేద్దాం
తాయెత్తులన్నీ పీకి సముద్రంలోకి విసిరేద్దాం
నిప్పుని గుప్పెట్లో పట్టుకుని నిలుచుందాం

కొట్టేద్దాం...కపాలం బద్దలయ్యేలోపు.. ఒక్కసారైనా.... కుండ బద్దలుకొట్టేద్దాం..!! 

'ఒంటరి'దీ కవిత...

తల్లి పేగుని తెంపుకుని విడివడిన క్షణం
నువ్వు అడుగుపెట్టింది విశాలమైన ప్రపంచం లోకి కాదు
ఒక శాశ్వతమైన ఒంటరితనం లోకి
నడక నేర్చింది మొదలు పరిగెడుతూనే ఉంటావు
ఒంటరిగా...
నడిచి నడిచి పరిగెత్తి పరిగెత్తి
పరిగెత్తి పరిగెత్తి నడిచి నడిచి
వెనక్కి తిరిగి చూసుకోవాలనుకున్నావో అంతే
అక్కడా నువ్వే నిలబడి ఉంటావు
అదే ఒంటరి తనాన్ని ఆనుకుని
నీ నీడ!?
ఎక్కడో ఉంటుంది చూడు
ఒంటరితనపు నల్లటి ముసుగు కప్పుకుని
హహహహ....మనసు!!
అక్కడ కనిపిస్తున్న బండరాళ్లని ఎత్తి చూడు
కింద కుళ్ళిపోయిన అనాధ శవమై కనిపిస్తుంది
పుడుతూనే బంధాన్ని తెంపుకున్నావే
మరి బ్రతుకంతా ఏ బంధం తోడొస్తుంది?
బంధాలనీ, అనుబంధాలనీ నీ చుట్టూ నువ్వల్లుకున్న
భ్రమలన్నీ నిన్ను చక్రభ్రమణంలో వేసి తిప్పుతాయి
తిరిగి తిరిగి చూస్తే నువ్వు ఉన్న చోటే ఉంటావు
అంతే ఒంటరిగా...
పిచ్చెక్కి, బట్టలు చింపుకుని
నడి రోడ్డు మీద నగ్నంగా నిలుచున్నా
నీవైపు ఎవ్వరూ కన్నెత్తి చూడరు
పొలికేకలు పెడుతున్న గొంతు పొలమారి
మౌనమనే సముద్రంలోకి దూకి కొట్టుకుపోతావు
ఒంటరి నావలా
సంభాషణకి తావులేని, సంఘర్షణకి ఓపికలేని
వెర్రి ఒంటరి పీనుగు నువ్విప్పుడు
జ్ఞాపకాలనుకుని నువ్వు పోగేసుకున్న చెత్త తగలబడి
కవురు వాసన కొడుతుంది
ఆ మంటలలోనూ నువ్వే తగలబడుతూ ఉంటావు
ఆ ఒంటరితనపు చితిపైనే
పగిలిన నీ కపాలపు ముక్కలు

ఒక్కొక్కటిగా విడివడతాయి... ఒంటరిగా...!!

వాడ్ని కడిగేయాల్సిందే!

  


నిజాల నీడలతో బొమ్మలాట ఆడుతున్న నీ కంటి పాపలు
నాతో అన్నాయి….
“వాడివన్నీ కలలే” అని.
ఒట్టి మట్టి గోడలేనటగా
నువ్వు చాటు చేసుకున్నది..
నీరు చేరనిస్తావేం మరి..!?
కరిగి నిన్ను కనబర్చవూ!?
ఆ మగత కళ్ళతో
దిగంతాల వైపు ఎందాకా చూస్తావు?
ఎన్నటికీ చేరలేవని నీకూ తెలుసుగా
మునివంటావే...!!
మరి మధ్య మధ్యలో మౌనం విడతావే?
ఇందుకేనా ముందుగానే
భూమధ్య రేఖ మీద నిలబడ్డావు!?
ఎటు దూకినా అగాధమే
ముందు నుయ్యి, వెనకా నుయ్యే!
గోతుల లోతులు సరిపోవు కదా!!
కింద  పడితే భళ్ళున పగిలి ముక్కలవుతావు
అప్పుడిక ఘోషించకు
వినేందుకు నేనుండను.
నీ మట్టి గోడలకు, ఓటి కలలకు
చితి పేర్చేందుకు వెళతాను!!


మార్నింగ్ సిక్నెస్

మై డియర్ మగవాడా!
నీ తప్పు లేదులే అయినా
మాకు కడుపుతో ఉన్నప్పుడే మార్నింగ్ సిక్నెస్
పాపం నీకు ప్రతి మార్నింగ్ “సిక్”నెస్సే కదా!
నిన్నని మాత్రం ఏం లాభంలే..!
దేవుడు పెట్టిన శాపమో
ఆయన ‘చేసిన’ పాపమో
నువ్వు ‘అనుభవిస్తున్నావు’..
ఏం చేస్తావు నువ్వు మాత్రం..!    
అందుకే “వాంతి” చేసుకునేందుకు 
నీ దారులు నువ్వెతుక్కుంటావు
బస్సు కుదుపులలో కలిపేస్తూ
మా వీపుల మీద వీరంగం చేస్తావు
లేదంటే మా వాష్ ‘బేస్’-ఇన్స్
ఎలాగూ అందుబాటులో ఉంటాయి
విసిలేసి వెనక్కెళ్ళండంటూ ఇంకాస్త మమ్మల్ని
నీకు అందుబాటులోకి తెచ్చేందుకు
కండక్టర్ అనబడు సాటి మగవాడు సదా తయార్!!
పంటి బిగువున మౌనంగా భరిస్తామే తప్ప ఏమీ అనము కదా
ఒకవేళ అన్నా, ఆ హడావిడిలో పట్టించుకునే తీరిక నీకెక్కడిది
ఇప్పుడు కూడా ఇదంతా ఎందుకంటావా..?
మై డియర్ మగవాడా !
ఈసారి కాసేపు తమాయించుకుని
ఆఫీస్ చేరి, వాష్రూమ్ లోనో
లేక ఇల్లు చేరి, “వాష్ ‘బేస్’-ఇన్” లోనో
కానిచ్చేంత వరకూ ఆగే ప్రయత్నం చేస్తావేమో అని చిన్న ఆశ..!







వాన...

వాన పడేలా ఉంది
మబ్బు పట్టింది ఆకాశమేనా?
చిత్తడి నేల తడింకా ఆరనేలేదు
మళ్ళీ చినుకు రాలుతోంది
తడిసిపోతున్న తలపులే సాక్ష్యంగా..!
పక్కటెముకలు లేని చక్క తలుపులను
ఎంతసేపు బిగించగలవు?
మట్టి గోడల మాటున ఎంతకాలం
నక్కి ఉండగలవు?
హోరుగాలి గోడు వెళ్ళబోసుకుంటుంది
తన హోరులో తానే కలిసిపోయి ఘొల్లుమంటుంది
వాన వెలిసిపోతుంది...
తాను తీసుకొచ్చిన శకలాలను
వదిలిపోయిన శిధిలాలను
నిర్వికార వదనంతో అలా చూస్తూ వెళ్ళిపోతుంది!!

నీ చిరునవ్వు

నీ చిరునవ్వు...
మల్లెమొగ్గ విచ్చినట్టు
చల్లగాలి వీచినట్టు
మంచుచుక్క తాకినట్టు
సన్నజాజి పాకినట్టు
నీ చిరునవ్వే...
జలపాతం జారినట్టు
పారిజాతం దొరికినట్టు
నెమలి పింఛం విరిసినట్టు
నింగి కొంచెం అందినట్టు
అది నీ నవ్వే...
నీటి బుడగ తేలినట్టు
పాల తరగ పొంగినట్టు
పూలవాన కురిసినట్టు
మేఘమాల సాగినట్టు
నీ నగుమోము...
చందమామకి పున్నమొచ్చినట్టు
పల్లెటూరికి పండగొచ్చినట్టు
చంటిపాప నిద్దరోతున్నట్టు
పంటచేను కాపుకాసినట్టు
నువ్వు నవ్వుతున్నట్టు.. నువ్వే నవ్వుతూ ఉన్నట్టు




నేనున్నాను..



నీ విజయాల్లో వెనకుండిపోయినా పరవాలేదు కానీ
పరాజయాల్లో మాత్రం పక్కనే ఉండనివ్వు 
ఇద్దరికీ ధైర్యంగా ఉంటుంది...

కాగితపు పడవలు


నా మనసు పుటల్లో నే రాసుకున్న కవితలన్నీ
కాగితపు పడవలై నిన్ను చేరనీ..!

ఆహుతి...


నిగూఢమైన నిప్పులన్నీ పోగేసుకుని
మండుతున్న అగ్నిగోళం నువ్వైతే
అగ్నికి ఆయువందించే వాయువు నేనై వస్తాను
నీ నిప్పు కణాలలోకి జొరబడి
రగిల్చి రగిల్చి నిన్ను మరింతగా మరిగించి
నిన్నంటుకున్న సెగలో నేనూ రగిలి
జ్వలితనై సుడులు తిరుగుతూ పైకెగసి
జడలు విప్పిన అగ్నిశిఖలా మిన్నంటి
నిన్ను నాలో నింపుకుని...
నన్ను నీకు అర్పించుకుని...
నీలో నేను లీనమై లయమై ఆహుతైపోతాను...!!

  

ఎర్ర తివాచీ!!


నా కాలికింద పరిచిన ఎర్ర తివాచీ మీద ముళ్ళు మొలిచాయెప్పుడో
నా జీవితపు ప్రశ్నకు వేరెవరో ఇచ్చిన సమాధానపు శిలువను మోస్తూ
పాదాలను చీల్చి వేస్తున్న ముళ్ళ తివాచీపై నడుస్తున్నాను
నేనే జాడకనుగొనలేనంతగా తివాచీ ఎరుపులో కలిసిపోయి నా రక్తపు అడుగులు
క్రమక్రమంగా వికృత రూపాలు దాల్చి నా వెంటపడసాగాయి
సాహసం, సత్తువ లేని నా పరుగు నన్నే ఓడించేస్తుంటే
నిస్సహాయంగా నిట్టూర్పుల పొగలు వదులుతూ నిలుచుండిపోయాను



Popular Posts

.