సృష్టిలోని మొదటి అద్భుతం
నిమిషమైన లేని జీవితం
క్షణక్షణానికీ మారే రూపం
హోయలోలికే సోయగం
అందులోనే ఎంతో అందం
ఆహ్లాదభరిత పరిమళం
అంతా అగరొత్తు పొగ సొంతం
తన చుట్టూ ఉన్నవారందరికీ
అరనిమిషంలో ఆనందాన్ని పంచి
మరుక్షణంలో మాయమైపోతుంది...
బంధనాలకి అందకుండా
స్వేచ్ఛావాయు విహారియై
ఉత్సాహంగా ఊరేగుతుంది...
వర్ణం, రూపం, భారం ఏదీ లేని ఒక మాయాజాలం...
శూన్యం మీద సమీరం గీసిన ఒక ఛాయాచిత్రం...
అరనిమిషపు ఆయువైనా.. అది పరిపూర్ణం, పవిత్రం, సార్ధకం...
అటువంటి అరనిమిషపు అగరొత్తు పొగై పుట్టేందుకు
ఇటువంటి 'మర'మనిషి జన్మ ఎన్నిసార్లు ఎత్తాలో!!
ఆ అగరొత్తు పోగనే నేనైతే!
ఆ స్వేచ్ఛావాయువే ఊపిరైతే!
ఆ సేవాభావమే ప్రాణమైతే!
ఆ అద్భుతానంద అరనిమిషపు జీవితమే నాదైతే!
ఆహా..! నా జన్మ ధన్యమే కాదా...!
అంతకన్నా గొప్ప వరమొకటున్నదా...!
1 comments:
ముందుగా అగరొత్తు పొగని వర్ణించి తర్వాత దానిని ఉపమానంగ వాడారు. బావుంది.
Post a Comment