ఇప్పుడేంటి?
ఆఖరికి నీకు కావాల్సింది ఏంటి?
తినటానికి తిండి, కట్టుకోటానికి బట్ట, ఉండటానికి ఇల్లు,
‘నా’ అని చెప్పుకోటానికి నలుగురు మనుషులు.
అంతేగా...?
అవన్నీ ఉన్నాయిగా... ఇంకేం కావాలి నీకు??
ఎప్పుడూ ఏదో ఒకదాని కోసం ఏడుస్తూనే ఉంటావేం??
పొద్దున్నే లేవటానికి ఏడుస్తావు!
లేచినదగ్గర్నుంచి ఎదుటివాడి మీద పడి ఏడుస్తావు!
దొరికిన దాన్ని చూసి సంతోషించక దొరకని దానికై ఏడుస్తావు!
ఏడుస్తూ పుట్టి, ఏడుస్తూ బ్రతికి, చివరికి చావటానికి కూడా ఏడుస్తావు!!
బ్రతుకు నీకు అంత ఏడుపైనప్పుడు చావు కూడా ఏడుపెందుకైంది నీకు??
కాసేపు ఆ ఏడుపాపి నీ చుట్టూ చూసుకో... కళ్ళు తెరువ్...
నీలోకి నువ్వు చూసుకో...
నిన్ను నువ్వు తెలుసుకో...
నీవాళ్ళని అర్ధం చేసుకో...
మూసుకున్న తలుపులు తెరుచుకుని బయటకి రా..
రంగులు కనబడతాయి.
నలుపొకటే రంగు కాదు...
ప్రకృతిని చూడు... ప్రకృతి గాలి పీల్చుకో... మనసంతా ప్రకృతి అందాన్ని పులుముకో...
ప్రకృతిలోని రంగులన్నీ నీ జీవితంలో నింపుకో ... నలుపుతో సహా...
ఇప్పుడు చూడు...
జీవితం ఎంత రంగులమయమైపోయిందో....!
ఎంత ఆనందం నీ చుట్టూ నాట్యమాడుతుందో...!!
3 comments:
chala inspiring ga undi me poem :)
అవును...కదా...నలుపుని కుడా కలుపుకుంటే...రంగుల.. సొబగు ..జీవితపు.. సౌందర్యం..తెలుస్తాయి..బావుంది..హాయిగా ...
bagundhi
Post a Comment