ఆదివారం



ఆదివారం వచ్చింది....
ఎన్నోరోజుల తరువాత వచ్చిన “నిజమైన ఆదివారం”.
రాత్రి నిద్రపోయే ముందే అలారాన్ని అటకెక్కించా!
సూర్యుడెంతసేపటినుంచి కొడుతున్నాడో తలుపు!
పాపం... నేను లేచి తలుపు తీసేసరికి
విసుగు, కోపం కలిసిన చూపొకటి విసిరాడు నాపైకి!!
అమ్మ మెడ చుట్టూ చేతులేసి,
బడికి పోనని మారం చేసే చంటిపిల్లోడిలా
ఎంత పొమ్మన్నా కళ్ళల్లోనుంచి పోనని మారం చేస్తోంది నిద్ర...
ఒక్క కప్పు కాఫీతో నిద్రనే నిద్రపుచ్చి, నన్ను నేను నిద్రలేపాను...!

రాత్రి కసిగా చెత్తబుట్టలోకి విసిరికొట్టిన ‘టు డు లిస్ట్’ని
ఒకసారి వెక్కిరింతగా చూసి నవ్వి
ఇవాళ ఏం చేద్దాం అనుకుంటుండగా
అల్మారా కనిపించింది...
మామూలు అల్మారా కాదది...
“గుండె అల్మారా”...!!
దగ్గరికెళ్ళి తెరవబోయాను. రాలేదు!
ఎన్నోరోజులుగా తెరవలేదేమో గడియ బిగుసుకుపోయింది!
బలమంతా ఉపయోగించి తెరిచాను ఎలాగో.

లోపలంతా అస్తవ్యస్తంగా పడున్నాయి జ్ఞాపకాలు...
ఒక్కొక్కటిగా భద్రంగా బయటకి తీస్తున్నాను...
ఎక్కడనుంచి ఏ జ్ఞాపకం జారిపడి ముక్కలైపోతుందో అని
అతి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాను...
ఇప్పుడు నా చుట్టూ ఎన్నెన్ని జ్ఞాపకాలో..!
కానీ అన్నీ కాస్త పాతపడినట్టుగా అనిపిస్తున్నాయి...!!
కొన్ని దుమ్ము దులపాల్సినవి,
కొన్ని కడిగి ఆరబెట్టాల్సినవి,
కొన్ని మెరుగు పెట్టాల్సినవి,
కొన్ని నానబెట్టి ఉతకాల్సినవి,
కొన్ని ఊడ్చిపడేయ్యాల్సినవి!!

అన్నింటినీ అనుకున్నట్టుగా విడివిడిగా అమర్చుకుని
ఇంక పనినారంభించాను.
ప్రతి దాన్ని మడతలు విప్పి, ముడతలు సరిచేస్తుంటే
వాటిలోనుంచి చిట్టి చిట్టి గువ్వలు, చిన్ని చిన్ని గవ్వలు,
రంగు రంగు పూసలు, సీతాకోక చిలుకలు, అచ్చమైన ముత్యాలు
జలజలా జారుతూ, నా చుట్టూ తిరుగుతూ, ఎగురుతూ,
గంతులేస్తూ, కళకళలాడుతూ కనువిందు చేస్తున్నాయి....
వాటన్నింటినీ చకచకా ఏరుకుని మూటకట్టి పెట్టాను..
జ్ఞాపకాలన్నింటినీ నా చేతులతో తడుముతుంటే
తెలియని అనుభూతుల వెల్లువ...

అమ్మపాలు తాగుతునట్టు...
నాన్న గుండెల మీద నిద్రపోయినట్టు...
అన్నతో కలిసి బడికిపోయినట్టు...
నానమ్మ ఒడిలో పడుకుని కథ విన్నట్టు...
పక్కింటి చింటూ గాడితో కలిసి ఆడుకున్నట్టు...
బడిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు...
కొత్తగా పరికిణీ కట్టినట్టు...
కొంటెగా ‘ఎవరో’ చూసినట్టు...
‘అతని’ వేలు పట్టుకుని నడిచినట్టు...
తొలిసారిగా తల్లినైనట్టు...
ఎన్నో, ఎన్నెన్నో ఆనందాలు, మరింకెన్నో అనుభూతులు....!!

అల్మరాని శుభ్రంగా తుడుచి, బాగు చేసిన జ్ఞాపకాలన్నింటినీ
క్రమబద్దంగా సర్ది, అనవసరమైన వాటిని ఊడ్చి పడేసాను!!
ఇప్పుడు అల్మారా ఎంత బావుందో....
ఎంత అందంగా ఉందో....
ఎంత ప్రశాంతంగా ఉందో....

అరె! చీకటి పడిందే!!
సూర్యుడి కోపం తగ్గినట్టుంది
తెల్లగా, చల్లగా నవ్వుతూ చూస్తున్నాడు
తెలియకుండానే ఆదివారం అరక్షణంలో అయిపోయింది
ఇంత నిజమైన ఆదివారాన్ని కలవటానికి
మళ్ళీ ఎన్ని అబద్దపు ఆదివారాలని దాటాలో అని ఆలోచిస్తూ
అటకవైపు చూసా.
అలారం కనిపించలేదు!!
అటకెక్కి చూస్తే మూలకి నక్కి దాక్కుంది!!
పాపం దాని బాధ దానిది..
నన్ను నిద్ర లేపటం కోసం మాత్రమే అది రోజూ నాకంటే ముందు లేవాలి కదా..!
దాన్ని లాక్కొచ్చి, చెవి మెలిపెట్టి, మంచం పక్కన కూర్చోబెట్టి
సోమవారపు సమరానికి సిద్ధపడుతూ కత్తి, డాలు పట్టుకుని,
నెత్తిన కిరీటం పెట్టుకుని నిద్రకుపకరించాను...!



2 comments:

బాలకృష్ణా రెడ్డి 30 April 2012 at 15:08

గుండెలోని జ్ఞాపకాలు భద్రంగా బయటకు తీశారు
ఎన్నెన్నో రూపాలుగా వాటిని చిత్రించారు
ఆదివారానికి వీడ్కోలు పలికారు
గీతాలు వింటూ మీ కవితా గానం ఎంత అద్భుతం

anrd 1 May 2012 at 00:56

చాలా బాగా వ్రాసారండి.

Post a Comment

Popular Posts

.