వెన్నెల గోదారి.....
వెండంచు అలల చీర చుట్టుకుని
నిండార స్నానమాడి
వయ్యారాల వంపుల మధ్య
తన్మయావస్థలో ఉన్న తడి వస్త్రాన్ని తడుముకుంటూ
మంద్రంగా నడిచి వచ్చి నా పక్కన కూర్చుంది...
తళుకులీనుతున్ననీటి బిందువులతో
మేనంతా మిణుగురుల మిలమిలలు..!
పాయలుదీరిన కృష్ణ కేశాలను సవరించుకుని
బరువైన తిమిత నేత్రాలను మూసుకుని
ఒక గాఢ నిట్టూర్పు విడుస్తూ
ఇసుకతెన్నెల మీద మెత్తగా ఒత్తిగిలి...
తుహిత తూరుపు పవనాల తాకిడికి
సన్నగా వణుకుతున్న పెదవులతో
మందస్వరాన మధువంతి ఆలపిస్తోంది...!
ప్రకృతంతా పరవశించి
పసిపాపలా పాకివచ్చి తన ఒడిని నిదురపోసాగింది...!
కనులు తెరిచి నన్ను చూసి
నా వెన్నెల గోదారి
ఒక దివ్యతాభరిత మందస్మితతో
వెనుదిరిగి పోయింది...!!
2 comments:
తన ఆరాటంలో చకోరిని చేస్తుంది
వస్తూ వస్తూ నిండుగా తడిపేస్తుంది
పూయని గంధమేదో గుబాలిస్తూ
కైపెక్కించి పరవశిస్తుంది
పుడమి ఓడిలో ఒత్తిగిలకముందే
మరింత పాలరంగేసుకుని
మాయమవుతుంది.
పక్ష కాలం వేచేది
ఈ ఘడియ తరంగం కోసమే.
నలుపు తెలుపు తెరల మీద
చిత్తరువయ్యేది ఈ వెన్నెల కోసమే.
ఈ పదాలు వేచేది
మీ వ్రాతలో భావలకోసమే!
:) thank u krishna garu..
Post a Comment