గుండెలో పొద్దుగుంకింది



గుండెలో నిన్ననగా పొద్దుగుంకింది
ఇంతవరకూ వెలుతురే రాలేదు
సూరీడు కోసం ఎదురుచూపు
ఎదురుచూపుగానే మిగిలిపోయింది
చూరుకు వేళ్ళాడుతున్న లాంతరులాగ
మిణుకుమిణుకుమంటూ కునుకు
కళ్ళను పట్టుకుని ఊగుతోంది
గుబులు తాలూకు నీడలు
గుండె నిండా పరుచుకుని భయపెడుతున్నాయి
ఏదేదో గొణుగుతున్న బాధ
కీచురాళ్ళ శబ్దంలాగా వినబడుతోంది
ఉండచుట్టిన కన్నీటి మూట ఉట్టిపైనే ఉంది
బొట్టుబొట్టుగా జారి గుండె నేలను తడుపుతున్నాయి కన్నీళ్లు
ఆవిరి..భరించలేని ఆవిరి లేచి
గుండె భగ్గున మండుతోంది
సూరీడి జాడింకా లేదు
కునుకు పోనూ పోదు, రానూ రాదు
సూరీడిక రాడని రూఢీగా తెలుపుతూ
ఈ చీకటి రాత్రికి మరింత నలుపును పూస్తూ
ఇంకొక పొద్దు వచ్చి వాలింది!!

ఒక కవి మరణించాడు!!


వాడి ఒళ్లంతా విషం
అక్షరాలా అక్షరాల విషం
ఎన్నక్షరాలను నమిలి మింగాడో
ఎన్నక్షరాలను గుటకలేస్తూ తాగాడో
ఒళ్లంతా విషమయం చేసుకున్నాడు
ఒకప్పుడు గొంతులోనే ఉండేది గరళం
ఇప్పుడు ఒళ్లంతా విషం!!
ఎన్ని కాట్లు వేసినా ఇంకిపోని విషం!!
ధమనిసిర దారులలో పోటెత్తుతూ...
వాడి కణకణాలను కాల్చేస్తూ...
మెదడు పొరల్ని మండిస్తూ...
విషం! విషం!! విషం!!!
భరించలేక భావురమన్నాడు
తల నేలేకేసి బాదుకున్నాడు
నరాలలోనుంచి విషాన్ని పిండి,
సిరా రూపంగా కలంలోకి వంపి,
తెల్లటి కాగితంపై
నల్లటి రక్తం కక్కుకు చచ్చాడు!!!


బతుకు దీపం


మసిబారిపోయి
మసకమసకగా
మధ్యతరగతి
బతుకు దీపం...
ఏరోజుకారోజు తుడిచి
వెలిగించాల్సిందే!!




మి(మై)థునం


శరీరాలకే కాని మనసులకేవి ఆంక్షలు?
రమించనీ...
ప్రచ్ఛన్నమైన భావాలు ఒక్కొక్కటిగా
పొరలు విప్పుకుని
సంభాషించుకోనీ..
స్పర్శానుభూతి పరిచయమే లేని
అంతరిత అభితాపాలను
అల్లుకుపోనీ..
చలిగింతల చివురు తపాలని
చిరుచెమటల చలికాచుకోనీ..
విమల మనో విచారాలను
పలుచని పొగ తీగల్లా అల్లుకుని
ఆవిరైపోనీ..
రాళ్ళు రగిలే కొలిమి కానివ్వు,
రమ్య రాగాల మిసిమి కానివ్వు
ఒక్కటిగా అనుభవించనీ..
నీకు, నాకు కలిగే నష్టమేముంది నేస్తమా..?
సుసాంగత్యపు మనోత్తాపం తప్ప..!

అద్వైతం



ఎన్ని ఏళ్ళు గడిచాయో...
ఎన్నెన్ని కాంతి యుగాలు నడిచాయో...
జ్ఞాపకాల పుటలెప్పుడో నిండిపోయాయి...!
కనుచూపుమేర ఎప్పుడో పొలిమేర దాటింది...!
నిర్నీతమైన ప్రస్థానమా..? నిర్దిష్టమైన అగ్రస్థానమా..?
కొలిక్కిరాని వెతుకులాటలో కొట్టుకుపోతూ...
లెక్క లెక్కకూ శేషమేదో మిగిలిపోతూ...
అగ్నిపర్వతాలు బద్దలై ఆశలు భగ్నకుసుమాలైపోతూ...
వెలుగునీడల దాగుడుమూతలో
ఒక చీకట్లోనుంచి మరో చీకట్లోకి పారిపోతూ...
ఎన్ని క్షణాల కణాలు ద్వంసమయ్యాయో కదా!
ఎన్ని ఉల్కలు నేలరాలాయో కదా!!
అయినా....
ఆయువో, అనంతవాయువో ఊపిరినూదుతూంది
దిగంబర దిగంతాలలో నా అన్వేషణ పూరణ దర్శనమిస్తుంది
సిద్దాంత రాద్దాంతాలకి తావులేని,
విశదీకరణకి వీలుకాని భావనది...
నాకు నేను దొరుకుతూ... నాలో నేను కలిసిపోతూ...
నాతో నేను రగిలిపోతూ... నేను నేనుగా మిగిలిపోతూ...
అవ్యాజ్యమైన, అతుల్యమైన ఆ ఆహుతి  జ్వాలలలో
తన్మయమై... తాదాత్మ్యమై... అద్వైతమైపోతూ....
నేను...నా నేను...!

కుహూరం


ఏకాంతమే వరిస్తోందో ఒంటరితనమే ఆవహిస్తోందో
నేను నిలబడిన చోటే ఉన్నాను..
కాలమైనా కదులుతోందా?
శూన్యానికి, కాలానికి సంబంధం లేదేమో!!
నా చుట్టూ పెరుగుతున్నఈ ఏకకేంద్రిక రాతి గోడల్ని
ఏ త్రిశూలాలు మాత్రం కూలగొట్టగలవు!?
ఎన్ని కుబుసాలను విడిస్తే నా నుంచి నేను వేరవ్వగలను!?
కాలమే లేని కుహూరమిది
కాలపరిమితి మాత్రం ఎలా ఉంటుంది!!





Popular Posts

.