వెన్నెల గోదారి



వెన్నెల గోదారి.....
వెండంచు అలల చీర చుట్టుకుని
నిండార స్నానమాడి
వయ్యారాల వంపుల మధ్య
తన్మయావస్థలో ఉన్న తడి వస్త్రాన్ని తడుముకుంటూ
మంద్రంగా నడిచి వచ్చి నా పక్కన కూర్చుంది...
తళుకులీనుతున్ననీటి బిందువులతో
మేనంతా మిణుగురుల మిలమిలలు..!
పాయలుదీరిన కృష్ణ కేశాలను సవరించుకుని
బరువైన తిమిత నేత్రాలను మూసుకుని
ఒక గాఢ నిట్టూర్పు విడుస్తూ
ఇసుకతెన్నెల మీద మెత్తగా ఒత్తిగిలి...
తుహిత తూరుపు పవనాల తాకిడికి
సన్నగా వణుకుతున్న పెదవులతో
మందస్వరాన మధువంతి ఆలపిస్తోంది...!
ప్రకృతంతా పరవశించి
పసిపాపలా పాకివచ్చి తన ఒడిని నిదురపోసాగింది...!
కనులు తెరిచి నన్ను చూసి
నా వెన్నెల గోదారి
ఒక దివ్యతాభరిత మందస్మితతో
వెనుదిరిగి పోయింది...!!



October 23, 2012 - , , , , , , 4 comments

నాన్న




ఇవాళ నాన్న నాకు కొత్తగా కనిపిస్తున్నారు!!
నాకు నడక నేర్పిన నాన్న
ఇప్పుడు నేను మరొకరితో ఏడడుగులు నడుస్తుంటే  ఆనందంగా చూస్తున్నారేం?
నా చేయి పట్టుకుని నన్ను జాగ్రత్తగా నడిపించిన నాన్న
ఇప్పుడా చేతిని మరొకరి చేతిలో పెడుతున్నారేం?
నాకు నాన్నైనా, నన్ను “అమ్మా” అని పిలిచే నాన్న
వచ్చే యేడుకి అమ్మనవమని కొత్తగా దీవిస్తున్నారేం?
నన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండలేక
చుట్టాలింటికి కూడా పంపించని నాన్న
ఇప్పుడు ఏ చుట్టరికం లేనివారింటికి పంపిస్తున్నారేం?
ఇదీ మన ఇంటిపేరు అని నాన్నే చెప్పారు
కానీ ఇప్పుడు నా ఇంటిపేరు అది కాదట!
నేను ‘నాన్న కూతుర్న’ని అందరూ అనేవారు
కానీ ఇప్పుడు నేను ‘ఆయన’ భార్యనట!!
ఒక్క పెళ్ళితో ఎన్ని మార్పులు!!
అప్పగింతల వేళ...
నన్నెందుకు ఇంట్లోనుంచి పంపించేస్తున్నారు?
నేనేమైనా తప్పు చేశానా నాన్నా...?? అని అడుగుదామనుకున్నాను
కానీ, నాన్న కళ్ళల్లో నీళ్ళు చూసి ఆగిపోయాను
నానమ్మ చనిపోయినప్పుడు కూడా నిబ్బరంగా ఉన్న నాన్న కళ్ళల్లో నీళ్ళు!!
అయినా కూడా నాన్న ముఖంలో ఏదో సంతోషం..
‘ఆయన’కి నన్నప్పగిస్తూ మెల్లగా నవ్వారు..
ఆ నవ్వులో ఒక ధైర్యం, ఒక నమ్మకం...
నా భయాలకి, బాధకి సమాధానం చెబుతున్నట్టుగా....

".............."



నిజం...
నా నిశ్చల నిర్జీవ ప్రపంచానికి ప్రాణం పోస్తుంది నీ నవ్వు
కొత్త జీవమేదో నాలో నింపే అమర ఆయువేమో నువ్వు
కాకుంటే, నలుపు తప్ప మరో రంగంటూ ఎరుగని నా కళ్ళలోకి 
ఇన్ని కాంతులెలా వస్తాయి?
సాగర ఘోషే కాదు చల్లగాలులూ మనసున వీస్తాయని తెలిసింది నిన్నుచూసాకే కదా
నిన్ను చూసే ఆ ఒక్క క్షణం కోసం
కొన్ని వేల కోట్ల విరహాలని అనుభవించటం అలవాటయ్యింది కూడా అప్పుడే
నిరంతరం అంతరంగ తరంగ ధ్వని మాత్రమే వినగల నాకు
సంగీతాన్ని పరిచయం చేసింది నీ మాట
కొన్ని క్షణాల నీ సాంగత్యంలో 
అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది నా మది
నీ ఆలంబనామ్రుతాన్ని ఆస్వాదిస్తూనే
నీ ఆలింగనానికై  పరితపించే నా అత్యాశ ఆత్మని  కూడా
 నీ సుతిమెత్తని స్పర్శతో మన్నిస్తూ
అది మంత్రమో, మాయో, మరింకే అపూర్వ అద్భుతమో 
నేను తేల్చుకునేలోపే వెళ్ళిపోతావు
మరికొన్ని వేల కోట్ల విరహాలని వరంగా ప్రసాదించి కనుమరుగైపోతావు
అయినా బాధెందుకు? మళ్ళీ నువ్వూ, నీ నవ్వు కనిపించేంతవరకు
ఈ విరహాన్నంతా పోగేసి వసంతంగా మార్చుకునే విద్యని
 ఎప్పుడో నేర్పించావుగా
ఆ వసంతపు వనంలో మనం..
జగత్తులోని శాంతమంతా కొలువైన నీ ఒడిలో నేను...
నన్ను ప్రేమగా పొదవుకుని, అదుముకుని, హత్తుకుని నువ్వు...
నీ ఒడిలో ఆ ప్రేమలో నీవాడినై, పసివాడినై, లాలనాభారిత నీ చేతులలో బంధీనైపోతూ నేను...
నన్ను, నా మనసును, నా సర్వేంద్రియాలనూ శాసించి, నియంత్రించే
 ఆ చిరునవ్వు నవ్వుతూ నువ్వు...




నాలో నీవుగా.... నీవే నేనుగా...



ఏ పేరూ లేని బంధమేదో అల్లుకుంటోంది
ఇదీ అని తెలియని భావమేదో కలుగుతోంది
ఇన్నాళ్ళు లేని కోరికేదో పుడుతోంది
ఎన్నడూ చూడని రూపమేదో కనబడుతోంది
ఎక్కడిదో ఒక పిలుపు... నన్నేనా?
మరెక్కడిదో ఒక నవ్వు... నాదేనా?
ఏదో తెలియని అలికిడి
ఇంకేదో ఎరుగని అలజడి
నరాలని పెనవేస్తూ...
నాడులని శ్రుతిచేస్తూ...
నాతో సంభాషిస్తూ...
నాకో సంకేతమిస్తూ...
నాలో సంఘర్షిస్తూ...
నాలో... నాలోలో...
నన్ను నీవుగా అనువదిస్తూ..
నీ రూపం నాదిగా చిత్రీకరిస్తూ...
నాలో నీవుగా.... నీవే నేనుగా...
మన ప్రేమ పాపగా పెరుగుతోంది...!



పునర్జన్మకెన్ని పురిటినొప్పులో!!!



నా తల్లి పురిటినొప్పులు పడుతోంది...
నన్ను మరలా కనేందుకు!
నా తల్లి తల్లడిల్లుతోంది...
నాకు పునర్జన్మనిచ్చేందుకు!
నా తల్లి నరాలు తెంపుకుంటోంది...
నా దారి సుగమనం చేసేందుకు!
నా తల్లి తన జగద్యోని తమస్సుని చింపుకుంటోంది...
నన్ను వెలుగురేఖల పొత్తిగుడ్డలలో చుట్టి, చూసి మురిసిపోయేందుకు!!

నేడు



నేటి కన్నా నిన్న తీపి..
నిన్న కన్నా రేపు తీపి..
నిన్న లేనే లేదు!
రేపు రానే రాదు!!
నిన్న-రేపటిల నడుమ
నేడు చిక్కుకున్నదేమిటి?
కదలనీ.. ముందుకు కదలనీ...

గతించిన నిన్నలో ఏముంది?
గతమైపోయిన జ్ఞాపకాలు తప్ప!
అగామియైన రేపటిలో ఏముంది?
అస్పష్టమైన ఆశలు తప్ప!
కని, విని, శ్వాసించి, స్పృశించి, ఆశ్వాదించగల నేటిని
కదలనీ.. ముందుకు కదలనీ...

స్తంభన చేతికి అప్పగించిన కళ్ళాలను
స్పందన చేజిక్కించుకోనీ
పంచకల్యాణిని పరుగులు తీయనీ
కదలనీ.. ముందుకు కదలనీ...
అడ్డుగోడలు, తులసి కోటలు అడ్డురానీ!
వేడి గాలులు, వాయుగుండాలు మింగివేయనీ!
ముళ్ళు కిరీటాలై అల్లుకోనీ!
రాళ్ళు వర్షాలై కురవనీ!
అడుగులను జడవనీకు
వెనుకకు మళ్ళనీకు
కదలనీ.. ముందుకు కదలనీ...
దిటవు చేసుకున్న గుండె ఆసరాగా
నిర్ణయించుకున్న నేటితో పాటుగా
సాగనీ.. నీ పయనం సాగనీ...



నైశిక



లోకమంతా నిదురిస్తోంది..
నేను తప్ప!
తెల్లవార వస్తోంది..
నాకు తప్ప!!
ఎంత వెతికినా నిద్దుర దరిదాపుల్లో కానరావటమే లేదు..
చీకటనేమో!!!
మరి వెలుతురేది? ఎక్కడుంటుందది??
అసలిది రాత్రేనా??
రాత్రయితే నిద్రేది?
నిద్రపోని జాతులు కొన్నున్నాయట..
వాటిలో నాదే జాతో!!
నిశాచరినా?
ఒక్క అడుగైనా కదపలేకున్నానే!
పిశాచాన్నా?
బరువెక్కిన ఊపిరి కాదంటోందే!
దివాభీతినా?
కన్ను పొడుచుకున్నా చూడలేకున్నానే!
గబ్బిలాన్నా?
ధ్వని తరంగాలు గుండెలోనే సుడులుతిరుగుతున్నాయే!
శూన్యగత్తెనా?
ఆ మంత్రమేదో మనసుకే వేసుకుందునే!
చందమామనా?
పున్నమంటూ ఎరుగనే!
బ్రహ్మ కమలాన్నా?
ఎన్నో వసంతాలుగా విరబూయనే లేదే!
మరి నేనెవరిని?
నా పగలు రాత్రుల మధ్యన
సన్నటి పొరైనా లేదేమిటి?
నిద్రపోనా? నిద్ర రాదా??
నిద్రిస్తూనే ఉన్నానా???
అసలు నేనే నిద్రనా????



ఆదివారం



ఆదివారం వచ్చింది....
ఎన్నోరోజుల తరువాత వచ్చిన “నిజమైన ఆదివారం”.
రాత్రి నిద్రపోయే ముందే అలారాన్ని అటకెక్కించా!
సూర్యుడెంతసేపటినుంచి కొడుతున్నాడో తలుపు!
పాపం... నేను లేచి తలుపు తీసేసరికి
విసుగు, కోపం కలిసిన చూపొకటి విసిరాడు నాపైకి!!
అమ్మ మెడ చుట్టూ చేతులేసి,
బడికి పోనని మారం చేసే చంటిపిల్లోడిలా
ఎంత పొమ్మన్నా కళ్ళల్లోనుంచి పోనని మారం చేస్తోంది నిద్ర...
ఒక్క కప్పు కాఫీతో నిద్రనే నిద్రపుచ్చి, నన్ను నేను నిద్రలేపాను...!

రాత్రి కసిగా చెత్తబుట్టలోకి విసిరికొట్టిన ‘టు డు లిస్ట్’ని
ఒకసారి వెక్కిరింతగా చూసి నవ్వి
ఇవాళ ఏం చేద్దాం అనుకుంటుండగా
అల్మారా కనిపించింది...
మామూలు అల్మారా కాదది...
“గుండె అల్మారా”...!!
దగ్గరికెళ్ళి తెరవబోయాను. రాలేదు!
ఎన్నోరోజులుగా తెరవలేదేమో గడియ బిగుసుకుపోయింది!
బలమంతా ఉపయోగించి తెరిచాను ఎలాగో.

లోపలంతా అస్తవ్యస్తంగా పడున్నాయి జ్ఞాపకాలు...
ఒక్కొక్కటిగా భద్రంగా బయటకి తీస్తున్నాను...
ఎక్కడనుంచి ఏ జ్ఞాపకం జారిపడి ముక్కలైపోతుందో అని
అతి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాను...
ఇప్పుడు నా చుట్టూ ఎన్నెన్ని జ్ఞాపకాలో..!
కానీ అన్నీ కాస్త పాతపడినట్టుగా అనిపిస్తున్నాయి...!!
కొన్ని దుమ్ము దులపాల్సినవి,
కొన్ని కడిగి ఆరబెట్టాల్సినవి,
కొన్ని మెరుగు పెట్టాల్సినవి,
కొన్ని నానబెట్టి ఉతకాల్సినవి,
కొన్ని ఊడ్చిపడేయ్యాల్సినవి!!

అన్నింటినీ అనుకున్నట్టుగా విడివిడిగా అమర్చుకుని
ఇంక పనినారంభించాను.
ప్రతి దాన్ని మడతలు విప్పి, ముడతలు సరిచేస్తుంటే
వాటిలోనుంచి చిట్టి చిట్టి గువ్వలు, చిన్ని చిన్ని గవ్వలు,
రంగు రంగు పూసలు, సీతాకోక చిలుకలు, అచ్చమైన ముత్యాలు
జలజలా జారుతూ, నా చుట్టూ తిరుగుతూ, ఎగురుతూ,
గంతులేస్తూ, కళకళలాడుతూ కనువిందు చేస్తున్నాయి....
వాటన్నింటినీ చకచకా ఏరుకుని మూటకట్టి పెట్టాను..
జ్ఞాపకాలన్నింటినీ నా చేతులతో తడుముతుంటే
తెలియని అనుభూతుల వెల్లువ...

అమ్మపాలు తాగుతునట్టు...
నాన్న గుండెల మీద నిద్రపోయినట్టు...
అన్నతో కలిసి బడికిపోయినట్టు...
నానమ్మ ఒడిలో పడుకుని కథ విన్నట్టు...
పక్కింటి చింటూ గాడితో కలిసి ఆడుకున్నట్టు...
బడిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు...
కొత్తగా పరికిణీ కట్టినట్టు...
కొంటెగా ‘ఎవరో’ చూసినట్టు...
‘అతని’ వేలు పట్టుకుని నడిచినట్టు...
తొలిసారిగా తల్లినైనట్టు...
ఎన్నో, ఎన్నెన్నో ఆనందాలు, మరింకెన్నో అనుభూతులు....!!

అల్మరాని శుభ్రంగా తుడుచి, బాగు చేసిన జ్ఞాపకాలన్నింటినీ
క్రమబద్దంగా సర్ది, అనవసరమైన వాటిని ఊడ్చి పడేసాను!!
ఇప్పుడు అల్మారా ఎంత బావుందో....
ఎంత అందంగా ఉందో....
ఎంత ప్రశాంతంగా ఉందో....

అరె! చీకటి పడిందే!!
సూర్యుడి కోపం తగ్గినట్టుంది
తెల్లగా, చల్లగా నవ్వుతూ చూస్తున్నాడు
తెలియకుండానే ఆదివారం అరక్షణంలో అయిపోయింది
ఇంత నిజమైన ఆదివారాన్ని కలవటానికి
మళ్ళీ ఎన్ని అబద్దపు ఆదివారాలని దాటాలో అని ఆలోచిస్తూ
అటకవైపు చూసా.
అలారం కనిపించలేదు!!
అటకెక్కి చూస్తే మూలకి నక్కి దాక్కుంది!!
పాపం దాని బాధ దానిది..
నన్ను నిద్ర లేపటం కోసం మాత్రమే అది రోజూ నాకంటే ముందు లేవాలి కదా..!
దాన్ని లాక్కొచ్చి, చెవి మెలిపెట్టి, మంచం పక్కన కూర్చోబెట్టి
సోమవారపు సమరానికి సిద్ధపడుతూ కత్తి, డాలు పట్టుకుని,
నెత్తిన కిరీటం పెట్టుకుని నిద్రకుపకరించాను...!



Popular Posts

.