లోకమంతా నిదురిస్తోంది..
నేను తప్ప!
తెల్లవార వస్తోంది..
నాకు తప్ప!!
ఎంత వెతికినా నిద్దుర దరిదాపుల్లో కానరావటమే లేదు..
చీకటనేమో!!!
మరి వెలుతురేది? ఎక్కడుంటుందది??
అసలిది రాత్రేనా??
రాత్రయితే నిద్రేది?
నిద్రపోని జాతులు కొన్నున్నాయట..
వాటిలో నాదే జాతో!!
నిశాచరినా?
ఒక్క అడుగైనా కదపలేకున్నానే!
పిశాచాన్నా?
బరువెక్కిన ఊపిరి కాదంటోందే!
దివాభీతినా?
కన్ను పొడుచుకున్నా చూడలేకున్నానే!
గబ్బిలాన్నా?
ధ్వని తరంగాలు గుండెలోనే సుడులుతిరుగుతున్నాయే!
శూన్యగత్తెనా?
ఆ మంత్రమేదో మనసుకే వేసుకుందునే!
చందమామనా?
పున్నమంటూ ఎరుగనే!
బ్రహ్మ కమలాన్నా?
ఎన్నో వసంతాలుగా విరబూయనే లేదే!
మరి నేనెవరిని?
నా పగలు రాత్రుల మధ్యన
సన్నటి పొరైనా లేదేమిటి?
నిద్రపోనా? నిద్ర రాదా??
నిద్రిస్తూనే ఉన్నానా???
అసలు నేనే నిద్రనా????
5 comments:
మీతో పాటూ నేను కూడా..ఇలానే అనుకొవాలేమో అపరంజితా గారు... ఏమైన మీ కావ్యం అంతరంగలను మీటుతుంది
నేను ఇదే కవితను ఐదు రోజుల క్రితం చదివాను... అర్ధం కాక ఈ రోజు మళ్ళీ చదివాను....కాని అర్ధం కాలేదు..! నాలాంటి అజ్ఞానులకు అర్ధం కాదంటారా..?
సత్య గారు, మీకు అర్ధంకానిదేంటో చెప్పండి. పదాలు అర్ధం కాలేదా? అర్ధం అర్ధం కాలేదా? అసలు కవితే అర్ధం కాలేదా? అది చెప్తే మీకు అర్ధమయ్యేలా చెప్తాను నేను..
సత్య గారు, మీ కామెంట్ నాకు మెయిల్ లో వచ్చింది. కానీ పబ్లిష్ చేయటానికి రావట్లేదు. బహుశా మీరు డిలీట్ చేసుంటారు. సరే, ఏది ఏమైనా మీ సందేహాలు నివృత్తి చేయటం నా బాధ్యత కనుక సమాధానం ఇస్తున్నాను. నేను ఈ కవిత ఎవర్నీ ఉద్దేశించి కానీ, ఏ విధమైన సందేశాలు ఇవ్వాలని కానీ, ఎటువంటి ప్రశ్నలూ సంధించాలని కానీ రాయలేదు. ఇది రాసే సమయానికి నాకు నిద్ర పట్టట్లేదు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోవటం చేత ఇది రాసాను. తెల్లవారుజామున పోస్ట్ చేసాను ఇది. రాత్రంతా నిద్రలేకుండా గడిపి తెల్లవారుతుండగా రాసాను.
ఇకపోతే మీకు అర్ధం కానీ పదాలు...
దివాభీతి= గుడ్లగూబ
నైశిక= nocturnal
:)
మీ అమూల్యమైన సమాధానానికి కృతజ్ఞతలు..
నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదములు.
Post a Comment