ఆహుతి...


నిగూఢమైన నిప్పులన్నీ పోగేసుకుని
మండుతున్న అగ్నిగోళం నువ్వైతే
అగ్నికి ఆయువందించే వాయువు నేనై వస్తాను
నీ నిప్పు కణాలలోకి జొరబడి
రగిల్చి రగిల్చి నిన్ను మరింతగా మరిగించి
నిన్నంటుకున్న సెగలో నేనూ రగిలి
జ్వలితనై సుడులు తిరుగుతూ పైకెగసి
జడలు విప్పిన అగ్నిశిఖలా మిన్నంటి
నిన్ను నాలో నింపుకుని...
నన్ను నీకు అర్పించుకుని...
నీలో నేను లీనమై లయమై ఆహుతైపోతాను...!!

  

ఎర్ర తివాచీ!!


నా కాలికింద పరిచిన ఎర్ర తివాచీ మీద ముళ్ళు మొలిచాయెప్పుడో
నా జీవితపు ప్రశ్నకు వేరెవరో ఇచ్చిన సమాధానపు శిలువను మోస్తూ
పాదాలను చీల్చి వేస్తున్న ముళ్ళ తివాచీపై నడుస్తున్నాను
నేనే జాడకనుగొనలేనంతగా తివాచీ ఎరుపులో కలిసిపోయి నా రక్తపు అడుగులు
క్రమక్రమంగా వికృత రూపాలు దాల్చి నా వెంటపడసాగాయి
సాహసం, సత్తువ లేని నా పరుగు నన్నే ఓడించేస్తుంటే
నిస్సహాయంగా నిట్టూర్పుల పొగలు వదులుతూ నిలుచుండిపోయాను



నేస్తమా...



ఓ నేస్తమా....
కాలాన్ని ఉండచుట్టి పట్టుకో
వడిసెలలో పెట్టి కోరికెల పట్టుని కొడదాము
ఝుమ్మని రేగిన కోరికెల వడిలో
కలిసిపోయి ఎగిరిపోదాము
నులివెచ్చని వెలుగు రేఖల వెంబడి పరిగెడదాము
క్రీనీడల వెనుక దోబూచులాటాడుదాము
నా నీడను నువ్వు ముద్దాడు
నీ నీడను నేను ముద్దాడతాను
ఒకరికొకరం దొంగలై దొరికిపోదాము
ఒకరికొకరం బంధీలైపోదాము
నా నేస్తమా...
ఆ చిట్టి చేమంతుల గుంపును చూడు
ఒక్కొక్కటిగా లెక్కపెడుతూ కోద్దాము
వాటితో మెత్తటి పరుపునేసి ఒత్తిగిలుదాము
పొగమంచు దుప్పటిలో
నాలో నువ్వు, నీలో నేను ఒదిగిపోదాము
నిండు చందమామని దండ గుచ్చి నా మెడలో వేయి
వేయి వేయి జన్మాల బంధం వేయి
చుక్కలు కొన్ని కోసి దోసిలిలో నింపి
నీ ముగము మీదకి ఊదుతాను
నీ చిరునవ్వు వెలుగుతో వాటికి ప్రాణం పోయి
ఓ నా నేస్తమా...
పచ్చని తీగలపై కాసేపు ఊయలలూగుదాము
నింగి కుందేటి మీదకి నిచ్చెనేసుకు ఎక్కుదాము
ఒకటే ఇంద్రధనస్సును ఒంటికి చుట్టుకుందాము
అమాంతం కలువల కొలనులో దూకుదాము
మడుగంతా రంగులమయం చేద్దాము
చిన్ని చేపపిల్లలా చక్కలిగింతలు పెడతావా
కొన్ని కిలకిలలు కానుకగా ఇస్తాను
పాలపిట్టల ఈకలతో తడి తుడుచుకుందాము
ఆరీ ఆరని ఆశల చలిలో అలా నడిచి పోదాము...

పొగమంచు తెరలు...


మన మధ్యన ఈ పొగమంచు తెరలు...
కదలాడుతున్న నీలి నీడలు...
గాలి తెమ్మరకి చెదిరినట్టే చెదిరి
మళ్ళీ కమ్ముకుంటూ...
అటువైపు నీ రూపం
అస్పష్టంగానైనా అపురూపంగా కనిపిస్తూ...
వేలుగురేఖల సూదిమొనలు గుచ్చుకుని
విచ్చిన్నమవుతూ మంచు రేణువులు
నీ నీలి నీడ రూపాన్ని కరిగిస్తూ...
అస్పష్టాన్ని ఇంకాస్త సంక్లిష్టం చేస్తూ...
అడ్డుగా ఉన్నది పొగమంచు కాదని
అద్దాల మేడని అనుభావకంగా తెలుపుతూ...
నీటి బిందువులై నేల జారుతున్నాయి...!!





Popular Posts

.