తన్వీ


అందాల అంగడి బొమ్మ తాను...
అంగడికే అందం తాను...
అమ్మ అనారోగ్యమో,
నాన్న అప్పుల బాధో,
ప్రేమించిన వాడి మోసమో,
పిల్లల ఆకలో,
కటుంబ భారమో,
భారమనుకున్న కుటుంబమో
చూపించిన దారిలో అలుపెరగని బాటసారి తాను...
బ్రతుకు పోరాటంలో గెలుపెరగని యోధురాలు తాను...
విలువలు లేని వీధుల్లో వెలవెలబోతుంది తాను...
రోజుకొక పేరుతో పిలువబడే అనామిక తాను...
పూటకొక కొత్త పరిమళంతో విరబూయు మల్లిక తాను..!

నిత్యం విషసర్పాలు సంచరించే శరీరం
కొన్ని కోట్ల కాట్లు వేయించుకుంటుంది!
సగం కాలిన సిగరెట్ట్టు పీకలతో
అదనపు సింగారాలు చేయించుకుంటుంది!
చీకటి సాక్షిగా చిద్రమైపోతున్న బ్రతుకు
కొన్ని వేలసార్లు చచ్చిపోతుంది!
పందిరి మంచానికి కట్టిన పూల మాలలకి
అంతరాత్మ ఉరేసుకుని వేళాడుతుంది!
మగ కత్తుల వేటుకి తెగి పడుతున్న మానాన్ని చూసి
మనసు మౌనంగా రోదిస్తుంది!
పీడ కలల్ని పొదవుకున్నతన కళ్ళు...
ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చలేవు!
రహస్యమంటూ ఎరుగని తన ఒళ్ళు...
పక్క మీద తప్పా పనికిరాదు!!

తానొక అలౌకిక..
తానొక పరాజిత..
తానొక విధి వంచిత...
తానొక అనర్ధ అశాతీత అనాధ..!!





2 comments:

Padmarpita 30 October 2011 at 15:27

Nice kavita...

జైభారత్ 23 March 2012 at 06:37

..జీవిత సత్యాలు కళ్ళముందు అవిష్కరిస్తుంటే...మౌనంగా చేష్టలుడిగి పోతాం...కొన్నిసార్లు...ఇప్పుడు..అంతే.

Post a Comment

Popular Posts

.