నేస్తమా...



ఓ నేస్తమా....
కాలాన్ని ఉండచుట్టి పట్టుకో
వడిసెలలో పెట్టి కోరికెల పట్టుని కొడదాము
ఝుమ్మని రేగిన కోరికెల వడిలో
కలిసిపోయి ఎగిరిపోదాము
నులివెచ్చని వెలుగు రేఖల వెంబడి పరిగెడదాము
క్రీనీడల వెనుక దోబూచులాటాడుదాము
నా నీడను నువ్వు ముద్దాడు
నీ నీడను నేను ముద్దాడతాను
ఒకరికొకరం దొంగలై దొరికిపోదాము
ఒకరికొకరం బంధీలైపోదాము
నా నేస్తమా...
ఆ చిట్టి చేమంతుల గుంపును చూడు
ఒక్కొక్కటిగా లెక్కపెడుతూ కోద్దాము
వాటితో మెత్తటి పరుపునేసి ఒత్తిగిలుదాము
పొగమంచు దుప్పటిలో
నాలో నువ్వు, నీలో నేను ఒదిగిపోదాము
నిండు చందమామని దండ గుచ్చి నా మెడలో వేయి
వేయి వేయి జన్మాల బంధం వేయి
చుక్కలు కొన్ని కోసి దోసిలిలో నింపి
నీ ముగము మీదకి ఊదుతాను
నీ చిరునవ్వు వెలుగుతో వాటికి ప్రాణం పోయి
ఓ నా నేస్తమా...
పచ్చని తీగలపై కాసేపు ఊయలలూగుదాము
నింగి కుందేటి మీదకి నిచ్చెనేసుకు ఎక్కుదాము
ఒకటే ఇంద్రధనస్సును ఒంటికి చుట్టుకుందాము
అమాంతం కలువల కొలనులో దూకుదాము
మడుగంతా రంగులమయం చేద్దాము
చిన్ని చేపపిల్లలా చక్కలిగింతలు పెడతావా
కొన్ని కిలకిలలు కానుకగా ఇస్తాను
పాలపిట్టల ఈకలతో తడి తుడుచుకుందాము
ఆరీ ఆరని ఆశల చలిలో అలా నడిచి పోదాము...

పొగమంచు తెరలు...


మన మధ్యన ఈ పొగమంచు తెరలు...
కదలాడుతున్న నీలి నీడలు...
గాలి తెమ్మరకి చెదిరినట్టే చెదిరి
మళ్ళీ కమ్ముకుంటూ...
అటువైపు నీ రూపం
అస్పష్టంగానైనా అపురూపంగా కనిపిస్తూ...
వేలుగురేఖల సూదిమొనలు గుచ్చుకుని
విచ్చిన్నమవుతూ మంచు రేణువులు
నీ నీలి నీడ రూపాన్ని కరిగిస్తూ...
అస్పష్టాన్ని ఇంకాస్త సంక్లిష్టం చేస్తూ...
అడ్డుగా ఉన్నది పొగమంచు కాదని
అద్దాల మేడని అనుభావకంగా తెలుపుతూ...
నీటి బిందువులై నేల జారుతున్నాయి...!!





గుండెలో పొద్దుగుంకింది



గుండెలో నిన్ననగా పొద్దుగుంకింది
ఇంతవరకూ వెలుతురే రాలేదు
సూరీడు కోసం ఎదురుచూపు
ఎదురుచూపుగానే మిగిలిపోయింది
చూరుకు వేళ్ళాడుతున్న లాంతరులాగ
మిణుకుమిణుకుమంటూ కునుకు
కళ్ళను పట్టుకుని ఊగుతోంది
గుబులు తాలూకు నీడలు
గుండె నిండా పరుచుకుని భయపెడుతున్నాయి
ఏదేదో గొణుగుతున్న బాధ
కీచురాళ్ళ శబ్దంలాగా వినబడుతోంది
ఉండచుట్టిన కన్నీటి మూట ఉట్టిపైనే ఉంది
బొట్టుబొట్టుగా జారి గుండె నేలను తడుపుతున్నాయి కన్నీళ్లు
ఆవిరి..భరించలేని ఆవిరి లేచి
గుండె భగ్గున మండుతోంది
సూరీడి జాడింకా లేదు
కునుకు పోనూ పోదు, రానూ రాదు
సూరీడిక రాడని రూఢీగా తెలుపుతూ
ఈ చీకటి రాత్రికి మరింత నలుపును పూస్తూ
ఇంకొక పొద్దు వచ్చి వాలింది!!

ఒక కవి మరణించాడు!!


వాడి ఒళ్లంతా విషం
అక్షరాలా అక్షరాల విషం
ఎన్నక్షరాలను నమిలి మింగాడో
ఎన్నక్షరాలను గుటకలేస్తూ తాగాడో
ఒళ్లంతా విషమయం చేసుకున్నాడు
ఒకప్పుడు గొంతులోనే ఉండేది గరళం
ఇప్పుడు ఒళ్లంతా విషం!!
ఎన్ని కాట్లు వేసినా ఇంకిపోని విషం!!
ధమనిసిర దారులలో పోటెత్తుతూ...
వాడి కణకణాలను కాల్చేస్తూ...
మెదడు పొరల్ని మండిస్తూ...
విషం! విషం!! విషం!!!
భరించలేక భావురమన్నాడు
తల నేలేకేసి బాదుకున్నాడు
నరాలలోనుంచి విషాన్ని పిండి,
సిరా రూపంగా కలంలోకి వంపి,
తెల్లటి కాగితంపై
నల్లటి రక్తం కక్కుకు చచ్చాడు!!!


బతుకు దీపం


మసిబారిపోయి
మసకమసకగా
మధ్యతరగతి
బతుకు దీపం...
ఏరోజుకారోజు తుడిచి
వెలిగించాల్సిందే!!




మి(మై)థునం


శరీరాలకే కాని మనసులకేవి ఆంక్షలు?
రమించనీ...
ప్రచ్ఛన్నమైన భావాలు ఒక్కొక్కటిగా
పొరలు విప్పుకుని
సంభాషించుకోనీ..
స్పర్శానుభూతి పరిచయమే లేని
అంతరిత అభితాపాలను
అల్లుకుపోనీ..
చలిగింతల చివురు తపాలని
చిరుచెమటల చలికాచుకోనీ..
విమల మనో విచారాలను
పలుచని పొగ తీగల్లా అల్లుకుని
ఆవిరైపోనీ..
రాళ్ళు రగిలే కొలిమి కానివ్వు,
రమ్య రాగాల మిసిమి కానివ్వు
ఒక్కటిగా అనుభవించనీ..
నీకు, నాకు కలిగే నష్టమేముంది నేస్తమా..?
సుసాంగత్యపు మనోత్తాపం తప్ప..!

అద్వైతం



ఎన్ని ఏళ్ళు గడిచాయో...
ఎన్నెన్ని కాంతి యుగాలు నడిచాయో...
జ్ఞాపకాల పుటలెప్పుడో నిండిపోయాయి...!
కనుచూపుమేర ఎప్పుడో పొలిమేర దాటింది...!
నిర్నీతమైన ప్రస్థానమా..? నిర్దిష్టమైన అగ్రస్థానమా..?
కొలిక్కిరాని వెతుకులాటలో కొట్టుకుపోతూ...
లెక్క లెక్కకూ శేషమేదో మిగిలిపోతూ...
అగ్నిపర్వతాలు బద్దలై ఆశలు భగ్నకుసుమాలైపోతూ...
వెలుగునీడల దాగుడుమూతలో
ఒక చీకట్లోనుంచి మరో చీకట్లోకి పారిపోతూ...
ఎన్ని క్షణాల కణాలు ద్వంసమయ్యాయో కదా!
ఎన్ని ఉల్కలు నేలరాలాయో కదా!!
అయినా....
ఆయువో, అనంతవాయువో ఊపిరినూదుతూంది
దిగంబర దిగంతాలలో నా అన్వేషణ పూరణ దర్శనమిస్తుంది
సిద్దాంత రాద్దాంతాలకి తావులేని,
విశదీకరణకి వీలుకాని భావనది...
నాకు నేను దొరుకుతూ... నాలో నేను కలిసిపోతూ...
నాతో నేను రగిలిపోతూ... నేను నేనుగా మిగిలిపోతూ...
అవ్యాజ్యమైన, అతుల్యమైన ఆ ఆహుతి  జ్వాలలలో
తన్మయమై... తాదాత్మ్యమై... అద్వైతమైపోతూ....
నేను...నా నేను...!

కుహూరం


ఏకాంతమే వరిస్తోందో ఒంటరితనమే ఆవహిస్తోందో
నేను నిలబడిన చోటే ఉన్నాను..
కాలమైనా కదులుతోందా?
శూన్యానికి, కాలానికి సంబంధం లేదేమో!!
నా చుట్టూ పెరుగుతున్నఈ ఏకకేంద్రిక రాతి గోడల్ని
ఏ త్రిశూలాలు మాత్రం కూలగొట్టగలవు!?
ఎన్ని కుబుసాలను విడిస్తే నా నుంచి నేను వేరవ్వగలను!?
కాలమే లేని కుహూరమిది
కాలపరిమితి మాత్రం ఎలా ఉంటుంది!!





సందే(హం)శం



గతించిన కాలపు గొంగడిని కప్పుకుని
నిషిద్ధ అంతరంగపు దారులలో సంచరిస్తూ
ఉన్న నా వెనుక ఈ పాదముద్రలెవరివి?
రవ్వంత సడి లేని నా ప్రపంచంలో వినబడుతున్న
ఆ కోటి సంభాషణల సారమేమిటి?
చెలియలకట్ట మీద నిలబడి
ప్రళయాన్ని ఆహ్వానిస్తున్న నన్ను
చేయి పట్టుకుని వెనకకు లాగిందెవరు?
వెనుదిరిగి చూసాను..
ఎవరూ లేరు!!
నేను ఎప్పుడో వదిలేసిన పావురాయి
నా వైపు యెగిరి వస్తూ కనిపించింది
చివరి చిరునామాలో ఉంటానని దానికేలా తెలిసిందో!!
అస్పష్టమైన సందేశమేదో మోసుకును వచ్చిందది
భాషే రాని నాకు భావమెలా అర్ధమవుతుంది?
అయినా మనసుకి, భావాలకి మధ్యన వంతెన
ఎప్పుడో చెదపురుగుల పాలయ్యిందిగా
సలహా చెప్పేందుకు, సందేహం తీర్చేందుకు
నా నీడైనా నా వెంట లేదే
ఏ ముళ్ళపొదకు చిక్కుకుని చిరిగిపోయిందో మరి
ఇంకెలా సమాధానమివ్వను? అసలీ సందేశాన్నేమనుకోను?
పావురాయిని చేతిలోకి తీసుకుని కూర్చుండిపోయాను
నానుండి నేనే తప్పిపోయాననిపిస్తుండగా!!

మౌన సాక్షి...



ఎప్పుడూ అనుకోనేలేదు...
నేను ముచ్చటగా కట్టుకున్న
చిట్టి చిట్టి పిచ్చుక గూళ్ళను
అలలు మింగివేస్తాయని..!

నాకెవరూ చెప్పనే లేదు...
నేను ముద్దుగా పెంచుకున్న
ముద్దబంతి పూవులు
మూడునాళ్ళకే వాడిపోతాయని..!

నేను ఎరుగను గాగ ఎరుగను...
వాననీటిలో వదిలిన కాగితపు పడవలు
తడిసిముద్దై చిరిగిపోతాయని..!

నాకు తెలియదు...
నా గది కిటికీలో
గూడు కట్టుకున్న గువ్వలు
ఒకనాడు ఎగిరిపోతాయని..!

ఇప్పుడన్నీ జరుగుతున్నాయి...
అంతా అర్ధమవుతోంది...
ఏం చేయగలను?
జరుగుతున్నదానికి మౌన సాక్షిగా నిలవటం తప్ప!!

వెన్నెల గోదారి



వెన్నెల గోదారి.....
వెండంచు అలల చీర చుట్టుకుని
నిండార స్నానమాడి
వయ్యారాల వంపుల మధ్య
తన్మయావస్థలో ఉన్న తడి వస్త్రాన్ని తడుముకుంటూ
మంద్రంగా నడిచి వచ్చి నా పక్కన కూర్చుంది...
తళుకులీనుతున్ననీటి బిందువులతో
మేనంతా మిణుగురుల మిలమిలలు..!
పాయలుదీరిన కృష్ణ కేశాలను సవరించుకుని
బరువైన తిమిత నేత్రాలను మూసుకుని
ఒక గాఢ నిట్టూర్పు విడుస్తూ
ఇసుకతెన్నెల మీద మెత్తగా ఒత్తిగిలి...
తుహిత తూరుపు పవనాల తాకిడికి
సన్నగా వణుకుతున్న పెదవులతో
మందస్వరాన మధువంతి ఆలపిస్తోంది...!
ప్రకృతంతా పరవశించి
పసిపాపలా పాకివచ్చి తన ఒడిని నిదురపోసాగింది...!
కనులు తెరిచి నన్ను చూసి
నా వెన్నెల గోదారి
ఒక దివ్యతాభరిత మందస్మితతో
వెనుదిరిగి పోయింది...!!



October 23, 2012 - , , , , , , 4 comments

నాన్న




ఇవాళ నాన్న నాకు కొత్తగా కనిపిస్తున్నారు!!
నాకు నడక నేర్పిన నాన్న
ఇప్పుడు నేను మరొకరితో ఏడడుగులు నడుస్తుంటే  ఆనందంగా చూస్తున్నారేం?
నా చేయి పట్టుకుని నన్ను జాగ్రత్తగా నడిపించిన నాన్న
ఇప్పుడా చేతిని మరొకరి చేతిలో పెడుతున్నారేం?
నాకు నాన్నైనా, నన్ను “అమ్మా” అని పిలిచే నాన్న
వచ్చే యేడుకి అమ్మనవమని కొత్తగా దీవిస్తున్నారేం?
నన్ను చూడకుండా ఒక్కరోజైనా ఉండలేక
చుట్టాలింటికి కూడా పంపించని నాన్న
ఇప్పుడు ఏ చుట్టరికం లేనివారింటికి పంపిస్తున్నారేం?
ఇదీ మన ఇంటిపేరు అని నాన్నే చెప్పారు
కానీ ఇప్పుడు నా ఇంటిపేరు అది కాదట!
నేను ‘నాన్న కూతుర్న’ని అందరూ అనేవారు
కానీ ఇప్పుడు నేను ‘ఆయన’ భార్యనట!!
ఒక్క పెళ్ళితో ఎన్ని మార్పులు!!
అప్పగింతల వేళ...
నన్నెందుకు ఇంట్లోనుంచి పంపించేస్తున్నారు?
నేనేమైనా తప్పు చేశానా నాన్నా...?? అని అడుగుదామనుకున్నాను
కానీ, నాన్న కళ్ళల్లో నీళ్ళు చూసి ఆగిపోయాను
నానమ్మ చనిపోయినప్పుడు కూడా నిబ్బరంగా ఉన్న నాన్న కళ్ళల్లో నీళ్ళు!!
అయినా కూడా నాన్న ముఖంలో ఏదో సంతోషం..
‘ఆయన’కి నన్నప్పగిస్తూ మెల్లగా నవ్వారు..
ఆ నవ్వులో ఒక ధైర్యం, ఒక నమ్మకం...
నా భయాలకి, బాధకి సమాధానం చెబుతున్నట్టుగా....

Popular Posts

.