అసంపూర్ణమైన అక్షరాలతో నా విధిరాత లిఖించబడింది.
అసంపూర్ణమైన అవయవాలు నాకు అమర్చబడినాయి.
అసంపూర్ణంగా పుట్టి, అసంపూర్ణంగా పెరిగి,
‘అసంపూర్ణుడి’గా ముద్రించబడ్డాను.
కన్నవాళ్ళకి నేనొక పరువునష్టాన్ని!
తోడబుట్టినవాళ్ళకి బ్రతుకు భారాన్ని!!
నాకు పేరు లేదు, ఊరు లేదు, సమాజంలో చోటు లేదు.
నన్ను అక్కున చేర్చుకోని ఈ సమాజం...
నన్ను ‘లెక్క’ చేయని ఈ సమాజం...
నా హక్కులను మాత్రం లాగేసుకుంది!!
నా శరీరమొక వినోద వస్తువు
నా వేషమొక వింత జంతువు
గుర్తింపు లేని నా ముఖం పైన
నా భావాలను కనిపించనియ్యక ఉండేందుకు
రకరకాల రంగులతో కప్పుతాను
అసంపూర్ణమైన ఈ శరీరంలో సంపూర్ణమైన మనసొకటుంది
అది నవ్వుతుంది...
ఏడుస్తుంది...
ఆశపడుతుంది....
ఎన్నెన్నో భావాలను మోస్తుంది....!
కొన్ని వేలసార్లు ముక్కలవుతుంది...!!
కానీ... దాని ఆచూకి కనుగునేదెవ్వడు?
దాని గోడు వినేదెవ్వడు?
రోజూ ఎన్నో రకాల చూపులు నన్ను తాకుతాయి
ఆకలిగా చూసేవి, అసహ్యంగా చూసేవి,
అలవాటుగా చూసేవి, ఆటపట్టింపుగా చూసేవి,
ఎన్నో, ఎన్నెన్నో చూపులు నా శరీరంగుండా దూసుకెళతాయి
కానీ... నా కళ్ళు మాత్రం ...
నన్ను కూడా ‘మనిషి’గా చూసే చూపు కోసం వెతుకుతాయి
వెతికి వెతికి అలిసిపోయి, నీరైపోయి
ఏ ‘పరిపూర్ణుడి’ మంచం మీదనో ఇంకిపోతాయి!!